Pakistan Navy: అరేబియా సముద్రంలో సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయిన ఒక భారత సరుకు నౌకకు పాకిస్తాన్ నేవీ సహాయం అందించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ చేసిన ఈ సాయం వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.? 

అస‌లేం జ‌రిగిందంటే.?

ఎమ్‌వీ గౌత‌మ్ అనే భారత కార్గో నౌక గుజరాత్‌లోని పోర్ బంద‌ర్ నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు వెళ్తుండగా మధ్యలో ఇంజిన్ ఫెయిల్ అయింది. దీంతో నౌక నియంత్రణ కోల్పోయి సముద్రంలో నిలిచిపోయింది. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో వెంటనే ఎమర్జెన్సీ సందేశం పంపించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సహాయం కోసం అభ్య‌ర్థ‌న‌

నౌక నుంచి పంపిన ఎమర్జెన్సీ సిగ్నల్ మొదట మేరిటైమ్ రెస్క్యూ కోఆర్డినేష‌న్ సెంట‌ర్ ముంబైకి చేరింది. అక్కడి నుంచి సమీపంలో ఉన్న పాకిస్తాన్ అధికారులకు సమాచారం అందించారు. సముద్రంలో అత్యవసర పరిస్థితుల్లో దేశాల మధ్య సహకారం అవసరం కావడంతో వెంటనే స్పందన వచ్చింది.

పాక్ నేవీ ఎలా స్పందించింది?

సమీపంలో గస్తీ కాస్తున్న పాకిస్థాన్ నేవీకి సమాచారం అందగానే వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. నౌకలో ఉన్న సిబ్బందిని పరిశీలించి వారికి తాగునీరు, ఆహారం, అవసరమైన మందులు అందించారు. దీంతో అక్కడి పరిస్థితి కొంత స్థిరపడింది. ఈ నౌకలో మొత్తం ఏడుగురు సిబ్బంది ఉన్నారు. వారిలో ఆరుగురు భారతీయులు కాగా ఒకరు ఇండోనేషియాకు చెందిన వ్యక్తి. సాంకేతిక సమస్య వల్ల వారు సముద్రంలో ఇరుక్కుపోయినప్పటికీ పాక్ నేవీ సమయానికి స్పందించడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు.

అంతర్జాతీయ ప్రమాణాలు..

సముద్రంలో ప్రమాదాలు జరిగినప్పుడు దేశాల మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టి సహాయం చేయడం అంతర్జాతీయ నిబంధనల్లో భాగం. ఈ ఘటనలో కూడా అదే జరిగింది. ఇటీవల కూడా ఇలాంటి ఘటనలో పాక్ నేవీ విదేశీ సిబ్బందిని రక్షించింది. ఈ పరిణామం సముద్రంలో మానవత్వం, సహకారం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది.