పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకుడు మరణించగా, అనేకమంది గాయపడ్డారు. ఈ దాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది. ఈ సంస్థ చరిత్ర ఏమిటి, దాని వెనుక ఉన్న శక్తులు ఏమిటి? తెలుసుకుందాం. 

Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం పర్యాటకులపై ఉగ్రదాడి జరిగింది. దీంతో 27 మంది పర్యాటకులు మరణించగా, చాలా మంది గాయపడ్డారు. ఈ దాడికి TRF (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) బాధ్యత వహించింది.

ఈ టీఆర్ఎఫ్ పాకిస్థానీ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తొయిబాతో సంబంధం కలిగి ఉంది. జనవరి 2023లో కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద దీనిపై నిషేధం విధించింది. 5 ఆగస్టు 2019న నరేంద్ర మోడీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత ఈ సంస్థ వెలుగులోకి వచ్చింది. అప్పటినుండి ఉగ్రకార్యకలాపాలను ముమ్మరం చేసిన ఈ సంస్థ తాజాగా మారణహోమానికి పాల్పడింది. 

ప్రారంభంలో TRF ఒక ఆన్‌లైన్ వేదిక. ఆరు నెలల కంటే తక్కువ సమయంలో ఇది ఆఫ్‌లైన్ సంస్థగా మారింది. ఈ ఉగ్రవాద సంస్థ వెనుక ప్రధాన శక్తి లష్కర్-ఎ-తొయిబా మరియు పాకిస్తాన్. లష్కర్‌తో పాటు ఇతర ఉగ్రవాద గ్రూపుల ఉగ్రవాదులు కూడా ఇందులో చేరారు. ఈ గ్రూప్ జమ్మూ కాశ్మీర్‌లో అనేక భయంకరమైన దాడులకు బాధ్యత వహించింది.

టిఆర్ఎఫ్ ను స్థాపించింది ఎవరో తెలుసా?

టిఆర్ఎఫ్ ను షేక్ సజ్జాద్ గుల్ అలియాస్ షేక్ సజ్జాద్ స్థాపించారు. సజ్జాద్ 10 అక్టోబర్ 1974న శ్రీనగర్‌లో జన్మించారు. 2022లో భారత ప్రభుత్వం అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. TRF కోసం లష్కర్ ఉపయోగించే నిధులను కూడా వాడుతున్నారు.

2022 గణాంకాల ప్రకారం జమ్మూ కాశ్మీర్‌లో మరణించిన 172 మంది ఉగ్రవాదుల్లో 108 మంది ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందినవారు. మరో డేటా ప్రకారం 100 మంది కొత్త ఉగ్రవాదుల్లో 74 మందిని TRF నియమించుకుంది. TRF చివరి పెద్ద దాడి గందర్‌బల్ ఉగ్రదాడి. గత సంవత్సరం ఉత్తర కాశ్మీర్‌లోని ఒక నిర్మాణ స్థలంలో ఏడుగురిని కాల్చి చంపారు.