ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పౌరులను చంపిన వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ పేరిట భారతదేశం దాడులు చేసిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
ఆపరేషన్ సింధూర్ పై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. గతంలో మాదిరిగానే మన సాయుధ దళాలు మరోసారి ఉగ్రమూకలకు తగిన సమాధానం ఇచ్చారన్నారు. “ఈ చర్య ఉగ్రవాద స్థావరాలకే పరిమితం చేయబడిందన్నాారు. పూర్తి ఆలోచనతో ఖచ్చితంగా నిర్వహించినట్లు తెలిపారు, మన సాయుధ దళాల ధైర్య సాహసాలకు తాను సెల్యూట్ చేస్తున్నానని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
మానవతా దృక్పథంతో భారతదేశం స్పందించిందని... అందుకే సాధారణ జనాభాకు హాని జరగకుండా చూసుకున్నామని తెలిపారు. ఇదే తమ ప్రాధాన్యత అని రక్షణ మంత్రి అన్నారు. ఘటనా స్థలాలను ఖచ్చితమైన నిఘా ఆధారంగా జాగ్రత్తగా ఎంచుకున్నామని... భారతదేశంపై దాడులను ప్రణాళిక చేయడంలో చురుగ్గా పాల్గొన్న ఉగ్రవాద శిబిరాలు వీటిలో ఉన్నాయని ఆయన విలేకరులకు తెలిపారు. ఉద్రిక్తతలను అనవసరంగా పెంచకుండా జాతీయ భద్రతను కాపాడుకునే లక్ష్యంతో ఈ ఆపరేషన్ జరిగిందని ఆయన నొక్కి చెప్పారు.
ఆపరేషన్ సింధూర్‌ను “ఖచ్చితత్వం, అప్రమత్తత, సున్నితత్వం”తో అమలు చేసినందుకు భారత సైన్యాన్ని ఆయన ప్రశంసించారు. పౌర ప్రాంతాలపై ఎలాంటి ప్రభావం చూపకుండా, ప్రణాళిక ప్రకారం నిర్దేశించిన అన్ని ఉగ్రవాద లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించామని ఆయన అన్నారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్ ప్రారంభించబడింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoJK)లోని ఉగ్రవాద శిబిరాలపై లోతైన దాడులు జరిగాయి. నైతిక ప్రమాణాలతో రాజీ పడకుండా ఉగ్రవాదంపై పోరాడాలనే భారతదేశ నిబద్ధతను సాయుధ దళాల ప్రవర్తన ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈక్రమంలో వారి వృత్తి నైపుణ్యాన్ని రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు.


