ఆపరేషన్ సింధూర్‌పై లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటనలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి కేవలం 22 నిమిషాల్లో భారత సైన్యం ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుందని తెలిపారు. 

Narendra Modi : ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యం చాలా ధైర్యసాహసాలను ప్రదర్శించింది… కానీ కాంగ్రెస్ మాత్రం వారిని అనుమానించేలా వ్యవహరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ (మంగళవారం) లోక్ సభలో ఆపరేషన్ సింధూర్ పై జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. 

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ తనకు ఫోన్ చేయడానికి గంటసేపు ప్రయత్నించారని… కానీ భారత సైన్యంతో సమావేశంలో ఉన్నందున తాను కాల్ తీసుకోలేకపోయానని మోదీ అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి కేవలం క్రూరమైన చర్య మాత్రమే కాదు దేశవ్యాప్తంగా హింసను వ్యాప్తి చేసి అల్లర్లను రేకెత్తించడానికి పథకం ప్రకారం జరిగిన కుట్రగా పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని… నేరానికి పాల్పడిన ఉగ్రవాదులను కేవలం 22 నిమిషాల్లోనే తీవ్రంగా శిక్షించామని మోదీ తెలిపారు.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ జరిపిన దాడుల్లో బహవల్పూర్, మురీద్కేతో సహా పాకిస్తాన్‌లోని కీలక ఉగ్రవాద కేంద్రాలు ధ్వంసమయ్యాయని… “మేడ్ ఇన్ ఇండియా” డ్రోన్లు, క్షిపణులు పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల బలహీనతను బయటపెట్టాయని ప్రధాని మోదీ అన్నారు.“మా విదేశాంగ విధానంతో ప్రపంచ మద్దతు లభించింది. కానీ దురదృష్టవశాత్తు మా సైనికుల ధైర్యసాహసాలకు, త్యాగానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు లభించలేదు” అని ప్రధాని మోదీ అన్నారు.

ఉగ్రవాదం పెరగడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని ప్రధాని మోదీ ఆరోపించారు. వారు ఉగ్రవాదులను ప్రసన్నం చేసుకున్నారని, బలహీనమైన నాయకత్వం వహించారని ఆయన అన్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు అఫ్జల్ గురుకు మద్దతు ఇచ్చారని, ఉగ్రవాదుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారని, పేలవమైన పాలన వల్ల దేశవ్యాప్తంగా పదే పదే ఉగ్రదాడులు, పౌరుల మరణాలు సంభవించాయని ఆయన అన్నారు.

లోక్‌సభలో ఆపరేషన్ సింధూర్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు

భారత దృక్పథంపై : 

"ఈ సభ ముందు భారతదేశ స్వరాన్ని ఉంచడానికి నేను ఇక్కడ నిలబడ్డాను. భారతదేశం వైపు చూడని వారికి, నేను ఇక్కడ అద్దం చూపించడానికి నిలబడ్డాను” అని మోదీ పేర్కొన్నారు. 

పహల్గాం ఉగ్రదాడిపై: 

“ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన క్రూర సంఘటన భారతదేశంలో అల్లర్లను రేకెత్తించడానికి ఒక కుట్ర. భారతదేశంలో హింసాత్మక ఘటనల కోసం జరిగిన ప్రయత్నం. దేశం ఆ కుట్రను ఐక్యతతో తిప్పికొట్టినందుకు నేను దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.”

భారత సైన్యం, ఆపరేషన్ సింధూర్‌పై: 

"భారత సాయుధ దళాలకు స్వేచ్ఛ ఇచ్చాము. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది వారే నిర్ణయించుకోవాలని చెప్పాము. వారు ఏప్రిల్ 22న జరిగిన దాడికి ప్రతీకారంగా 22 నిమిషాల్లోనే ఖచ్చితమైన దాడులు చేశారు. ఉగ్రవాదులను శిక్షించడం మాకు గర్వకారణం… ఇది ఎలాంటి శిక్ష అంటే ఉగ్రవాద సూత్రధారులు ఈ రోజు వరకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది."

పాకిస్తాన్ అణు బెదిరింపులపై: 

“పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం ఒక పెద్ద చర్య తీసుకుంటుందని పాకిస్తాన్ దళాలకు అర్థమయ్యింది. అందుకే వారు అణు బెదిరింపులు చేయడం ప్రారంభించారు. మే 6-7 తేదీల మధ్య రాత్రి భారతదేశం నిర్ణయించినట్లుగానే చర్య తీసుకుంది. పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయింది. అనేక పాకిస్తాన్ వైమానిక స్థావరాలు ఇప్పుడు ఐసియులో ఉన్నాయి. పాకిస్తాన్ రెచ్చగొట్టే ప్రయత్నంచేస్తే దానికి బలమైన, సరిపోయే ప్రతిస్పందన ఇవ్వబడుతుంది”

ఉగ్రవాదంపై భారతదేశ వైఖరిపై: 

“ఉగ్రదాడి జరిగితే భారతదేశం తనదైన రీతిలో ప్రతిఘటన చేస్తుంది. ఉగ్రవాద సూత్రధారులకు, వారికి రాజకీయంగా మద్దతు ఇచ్చేవారి మధ్య ఇక తేడా ఉండదు. ఈ కొత్త పద్దతిని భారత్ అవలంభిస్తోంది. 'సింధూర్ నుండి సింధు వరకు' (సింధు జల ఒప్పందానికి సంబంధించి), మేము పాకిస్తాన్‌పై చర్య తీసుకున్నాము.”

కాంగ్రెస్‌పై: 

“మాకు ప్రపంచ మద్దతు లభించింది. కానీ దురదృష్టవశాత్తు మన జవాన్ల పరాక్రమానికి కాంగ్రెస్ మద్దతు లభించలేదు. ఏప్రిల్ 22 దాడి జరిగిన 3-4 రోజుల తర్వాత కాంగ్రెస్ నాయకులు ‘56 అంగుళాల ఛాతీ ఎక్కడ?’ అని… ‘మోదీ ఎక్కడ అదృశ్యమయ్యారు?’ అని ప్రశ్నించడం ప్రారంభించారు. పహల్గాంలో అమాయక ప్రజల హత్యలో కూడా వారు రాజకీయాలు చేశారు. కాంగ్రెస్ పాకిస్తాన్ రిమోట్ కంట్రోల్‌లో ఉంది… అందుకే ఆ దేశం చెప్పేదాన్ని మాత్రమే నమ్ముతుంది.”

డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వ వాదనపై:

“ప్రపంచంలో ఏ నాయకుడూ భారతదేశాన్ని… దాని ఆపరేషన్‌ను ఆపమని చెప్పలేదు. మే 9వ తేదీ రాత్రి అమెరికా వైస్ ప్రెసిడెంట్ నాతో మాట్లాడటానికి ప్రయత్నించారు. ఆయన ఒక గంట పాటు ప్రయత్నించారు… కానీ నేను నా సైన్యంతో సమావేశంలో ఉన్నాను కాబట్టి ఆయన కాల్ తీసుకోలేకపోయాను. తర్వాత నేను ఆయనకు తిరిగి ఫోన్ చేశాను. పాకిస్తాన్ పెద్ద దాడి చేయబోతోందని అమెరికా వైస్ ప్రెసిడెంట్ నాకు ఫోన్‌లో చెప్పారు. పాకిస్తాన్‌కు ఈ ఉద్దేశం ఉంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నాను. పాకిస్తాన్ దాడి చేస్తే మేము మరింత ఘాటుగా స్పందిస్తాము.. ఇదే నా సమాధానం.”

సింధు జల ఒప్పందంపై:

“1960 సింధు జలాల ఒప్పందం భారతీయ రైతులను విస్మరించింది, అభివృద్ధికి హాని కలిగించింది. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాకిస్తాన్ అన్యాయమైన డిమాండ్లను అంగీకరించారు, భారతీయ ఆనకట్టల డీసిల్టింగ్‌ను నిరోధించారు, పశ్చిమ భారతదేశంలో దశాబ్దాలుగా ప్రధాన నీటి, విద్యుత్ ప్రాజెక్టులను నిలిపివేశారు.”

Scroll to load tweet…