ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్ ప్రధాని మోడీ సమక్షంలో ఇవాళ(బుధవారం) నామినేషన్ దాఖలు చేశారు. 

CP Radhakrishnan Nomination : భారత నూతన ఉపరాష్ట్రపతి ఎంపిక కోసం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికార ఎన్డిఏ కూటమి సిపి రాధాకృష్ణన్ ను, ఇండి కూటమి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి లను అభ్యర్థులుగా ప్రకటించాయి. ఈ క్రమంలో ఇవాళ (బుధవారం) ఎన్డీఏ అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్ ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, జె.పి నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాధాకృష్ణన్ దాదాపు 20 మంది ప్రతిపాదకులు, 20 మంది మద్దతుదారుల సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. 

Scroll to load tweet…

ఉదయం ఆయన పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. పార్లమెంట్‌లోని ఛత్రపతి శివాజీ మహారాజ్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, రాణి లక్ష్మీబాయి, బి.ఆర్. అంబేద్కర్, భగవాన్ బిర్సా ముండా విగ్రహాలకు కూడా నివాళులర్పించారు. సి.పి. రాధాకృష్ణన్‌తో పాటు కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, ధర్మేంద్ర ప్రధాన్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎల్. మురుగన్, బిజెపి నేత వినోద్ తావడే ఉన్నారు.

రాధాకృష్ణన్ గతంలో పార్లమెంట్ సభ్యుడిగా, జార్ఖండ్, తెలంగాణ గవర్నర్‌గా పనిచేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. జూలై 31, 2024 నుండి మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికోసం పోటీపడుతున్నారు.

రెండుసార్లు కోయంబత్తూరు నుండి ఎంపీగా పనిచేసిన రాధాకృష్ణన్ అక్టోబర్ 20, 1957న తమిళనాడులోని తిరుపూర్‌లో జన్మించారు.
తమిళనాడుకు చెందిన ఈ బిజెపి నేత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. 1974లో బిజెపి పూర్వ సంస్థ భారతీయ జనసంఘ్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేశారు… జనసంఘ్‌కు ముందు ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ద్వారా ఆయన ప్రజల్లోకి వచ్చారు. 1996లో రాధాకృష్ణన్ బిజెపి తమిళనాడు కార్యదర్శిగా నియమితులయ్యారు, ఆ తర్వాత 1998లో కోయంబత్తూరు నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు, 1999లో రెండోసారి ఎన్నికయ్యారు.

ఎంపీగా తన పదవీకాలంలో ఆయన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (PSUs) కోసం పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా, ఫైనాన్స్ కోసం కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ స్కామ్‌ను దర్యాప్తు చేసే పార్లమెంటరీ స్పెషల్ కమిటీలో రాధాకృష్ణన్ సభ్యుడిగా కూడా ఉన్నారు.