Naxal free India: అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు స‌వాల్ విసురుతోన్న న‌క్స‌లిజాన్ని అంతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఆ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తోంది. 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్రం చెబుతోంది.   

1967లో మొద‌లైన న‌క్సలిజం

భారతదేశం ఎన్నో దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న అతిపెద్ద అంతర్గత భద్రతా సవాలు నక్సలిజం. 1967లో పశ్చిమ బెంగాల్‌లో మొదలైన ఈ ఉద్యమం, తరువాత మధ్యభారతంలోని అరణ్య ప్రాంతాలకు విస్తరించింది. కర్రెగుట్ట ప్రాంతం ఈ ఉద్యమానికి ఒక ప్రధాన కేంద్రంగా నిలిచింది. ఇప్పుడు అదే ప్రదేశంలో జాతీయ జెండా ఎగురుతుండటం చరిత్రలో ఒక పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు.

21 రోజుల అతి పెద్ద ఆపరేషన్

2025 ఏప్రిల్ 21 నుంచి మే 11 వరకు సాగిన ఈ ఆపరేషన్‌లో భద్రతా దళాలు తమ సైనిక శక్తిని ప్రదర్శించాయి. 60 కి.మీ పొడవు, 20 కి.మీ వెడల్పు గల కర్రెగుట్ట కొండ అరణ్యం నక్సలైట్లకు దుర్భేద్య కోటగా ఉండేది. 21 రోజులపాటు జ‌రిగిన భారీ ఎన్‌కౌంటర్లలో మొత్తం 31 మంది నక్సలైట్లు మట్టుపడ్డారు. ఇందులో 16 మంది మహిళా మిలిటెంట్లు కూడా ఉన్నారు.

ఎర్ర జెండా నుంచి జాతీయ జెండా వరకు

కర్రెగుట్ట ఒకప్పుడు నక్సలిజం కేంద్రబిందువు. PLGA బెటాలియన్ 1, సెంట్రల్ రీజనల్ కమిటీ (CRC), తెలంగాణ రాష్ట్ర కమిటీ.. ఈ మూడు ప్రధాన విభాగాల కార్యకలాపాలు ఇక్కడ నుంచే నడిచేవి. శిక్షణ, ఆయుధ తయారీ, వ్యూహరచన అన్నీ ఇక్కడ జరిగేవి. ఇప్పుడు అదే ప్రదేశంలో భారత త్రివర్ణ పతాకం ఎగరడం ఒక ప్రతీకాత్మక విజయం.

ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం స్పష్టమైన వ్యూహం

"2026 మార్చి 31 నాటికి భారతదేశం పూర్తిగా నక్సల్ ముక్త్ భారత్ అవుతుందని హోం మంత్రి అమిత్ షా ఇది వ‌ర‌కే ప‌లుసార్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మోదీ ప్రభుత్వం మొదటి నుంచే మూడు ప్రధాన సమస్యలను లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాట్లు, నక్సలిజం ప్ర‌ధాన అంశాలు. ఈ మూడు సవాళ్లలో కర్రెగుట్ట ఆపరేషన్ విజయవంతం కావడం అత్యంత చారిత్రక ఘట్టంగా నిలిచింది.

సైనికుల పోరాటం

45 డిగ్రీల ఎండ, దట్టమైన అరణ్యం, గుహలు, అంబుష్ పాయింట్లు – ఇవన్నీ సైనికులకు అడ్డంకులు అయ్యాయి. అయినప్పటికీ CRPF, STF, DRG దళాలు వెనుదిరగలేదు. కొందరు సైనికులు ఐఈడి పేలుళ్లలో గాయపడ్డా, ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. ఈ విజయాన్ని భద్రతా దళాల ధైర్యం, సమన్వయం నిరూపించాయి.

నక్సలైట్లకు తీర‌ని న‌ష్టం

కేంద్రం చేప‌ట్టి ఈ ఆప‌రేష‌న్‌లో న‌క్స‌లైట్లు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. భ‌ద్ర‌తా ద‌ళాలు ఇప్ప‌టి ర‌కు సుమారు 214 బంకర్లు, సీక్రెట్‌ స్థావరాలు ధ్వంసం చేశారు. 450 ఐఈడీలు, 818 బీజీఎల్ షెల్లు స్వాధీనం అయ్యాయి. టన్నులకొద్ది పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. రెండు సంవత్సరాల వరకు సరిపడే ఆహార నిల్వలు నాశనం చేశారు.

నక్సలైట్లు వాడుతున్న నాలుగు సాంకేతిక యూనిట్లు ధ్వంసమయ్యాయి. ఇవే వారికి బాంబులు, లోకల్ ఆయుధాలు తయారు చేసే కేంద్రాలు.

న‌క్స‌లిజాన్ని ఎందుకు అంతం చేయాల‌నుకుంటున్నారు.?

నక్సలిజం మొదట భూసంస్కరణ, రైతు హక్కుల పేరుతో ప్రారంభమైంది. కానీ తర్వాత ఇది హింసాత్మక సిద్ధాంతంగా మారింది.

* అభివృద్ధి పనులను అడ్డుకోవడం

* పాఠశాలలు, రహదారులు, ఆసుపత్రులు నిర్మించకుండా అడ్డుకోవడం

* కాంట్రాక్టర్లను, పేద రైతులను చంపడం

* "ప్రజా న్యాయస్థానాలు" పేరుతో అమానుష శిక్షలు విధించడం

ఈ విధంగా నక్సలైట్లు గిరిజనులను రక్షించాలనే పేరుతో వారినే అణచివేశారని ప్ర‌భుత్వం అంటోంది.

గిరిజ‌నుల్లో కూడా వ్య‌తిరేత పెరిగిందా.?

నక్సలైట్లు ఎప్పుడూ "గిరిజనుల మిత్రులు" అని చెప్పుకుంటారు. కానీ వాస్తవం వేరే ఉంద‌నే వాద‌న ఉంది.

లొంగని గిరిజనులను "సమాచారదారులు" అంటూ హతమార్చారు. గ్రామస్తులను నిరంతరం భయపెడతారు.

ఈ కారణాల వల్లే గిరిజనులు కూడా ఇప్పుడు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారనే వాద‌న తెర‌పైకి వ‌చ్చింది.

కేంద్ర-రాష్ట్ర సమన్వయం విజయానికి మూలం

ఈ ఆపరేషన్ విజయానికి ప్రధాన కారణం రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ అని చెబుతుంటారు. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీస్ ఫోర్సులు, ఇంటెలిజెన్స్ విభాగాలు, మూడు స్థాయిల సమన్వయం వల్లే నక్సలైట్లు త‌ల‌దాచిన ప్ర‌దేశాలు, ఆయుధ గోదాములు గుర్తించ‌డం సాధ్య‌మైంది.

10 ఏళ్ల‌లో జ‌రిగిన మార్పులు ఇవే.

మోదీ ప్రభుత్వం వచ్చాక నక్సలిజంపై భారీగా దెబ్బ ప‌డింది. 2014లో 126 జిల్లాల్లో న‌క్స‌లిజం ప్ర‌భావం ఉండ‌గా ఇప్పుడు ఆ సంఖ్య కేవ‌లం 18కి చేరింది. అత్యంత ప్రభావిత జిల్లాలు 36 నుంచి 6కు తగ్గాయి. భద్రతా శిబిరాలు 66 నుంచి 555కు పెరిగాయి. సైనికుల మరణాలు 2014లో 88 ఉండగా, 2024లో 19కి త‌గ్గింది. 2024లో 928 మంది, 2025లో నాలుగు నెలల్లోనే 718 మంది నక్సలైట్లు లొంగిపోయారు.

సిద్ధాంత స్థాయిలో కూడా..

"నక్సలిజం కేవలం తుపాకీతో కాదు, సిద్ధాంత స్థాయిలో కూడా ఓడించాలి" అని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. లొంగిపోయిన వారికి అవ‌కాశం ఇస్తామ‌ని, కానీ అమాయ‌కుల‌ను చంపితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. "దేశ భద్రత, సాంస్కృతిక జాతీయత, భారతీయ విలువలు – ఇవే త‌మ‌ పార్టీ లక్ష్యాలని షా స్ప‌ష్టం చేశారు.

న‌క్స‌ల్స్ ర‌హిత భార‌తానికి కేంద్రం ప్లాన్ ఇదే..

కేవ‌లం భ‌ద్ర‌తా చ‌ర్య‌ల ప‌రంగా కాకుండే అభివృద్ధి పనులు, పేదలకు సంక్షేమ పథకాలు, ఆర్థిక నెట్‌వర్క్‌లపై దాడులు, అర్బన్ నక్సల్స్‌ను నియంత్రించడం వంటి అంశాల‌ను కేంద్రం ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా 2026 నాటికి నక్సలిజం పూర్తిగా అంతమవుతుందని నమ్మకంగా చెబుతున్నారు. ఇలా క‌ర్రెగుట్ట ఆప‌రేష‌న్ భారతదేశం నుంచి నక్సలిజం పూర్తిగా అంతం అవుతున్న సంకేతమ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీంతో 2026 నాటికి దేశం "నక్సల్ ముక్త్ భారత్" గా మారబోతుందనే ఆశలు ఇప్పుడు మరింత బలపడ్డాయి.

మావోయిస్టుల కాల్పుల విరమణపై ఘాటూగా స్పందించి షా

ఇదిలా ఉంటే కేంద్రం ప్రభుత్వం చేపట్టిన నక్సలైట్ల ఏరివేతపై నక్సలైట్ మావోయిస్టుల్లో కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తుపాకులను పూర్తిగా వదిలివేస్తున్నట్లు ఇటీవల ఓ లేఖ్ హల్చల్ చేయగా.. తుపాకీని వీడేది లేదంటూ తాజాగా మరో లేఖ బయటకు వచ్చింది. అయితే ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టుల తరఫున వచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనను ఆయన ఖండించారు. అయితే ఆయుధాలను వదిలి, లొంగిపోయేందుకు ముందుకు వస్తే వారికి స్వాగతం పలుకుతామని స్పష్టం చేశారు.

కాల్పుల విరమణ అవసరం లేదన్న కేంద్రం

దిల్లీలో జరిగిన “నక్సల్‌ రహిత భారత్‌” సదస్సు ముగింపు సమావేశంలో అమిత్‌ షా మాట్లాడుతూ – ‘‘మావోయిస్టుల నుంచి ఇటీవల ఓ లేఖ బయటపడింది. అందులో తాము తప్పు చేశామని, కాల్పుల విరమణ అవసరమని, లొంగిపోవాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు. కానీ లొంగిపోవాలంటే కాల్పుల విరమణ అవసరం లేదు. ఆయుధాలను వదిలి బయటకు రండి. ఒక్క బుల్లెట్ కూడా వారిని తాకదు. వారికి గౌరవప్రదంగా స్వాగతం పలికి, పునరావాసం కల్పిస్తాం’’ అని ఆయన స్పష్టం చేశారు.

అమిత్‌షా ఇంకా మాట్లాడుతూ.. వామపక్షాలు చెప్పినట్లుగా అభివృద్ధి లోపమే మావోయిస్టు హింసకు కారణమని తాము నమ్మమని స్పష్టం చేశారు. వాస్తవానికి మావోయిస్టు హింస కారణంగానే దశాబ్దాలుగా అనేక ప్రాంతాలు వెనుకబడ్డాయని చెప్పారు. ఆయుధ పోరాటం వల్ల గిరిజన ప్రాంతాలు విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రాథమిక వసతులను కోల్పోయాయని విమర్శించారు. ‘‘మావోయిస్టు హింసకు నిశ్శబ్దంగా మద్దతు ఇచ్చిన వామపక్ష పార్టీలు, ప్రభుత్వం ఆపరేషన్‌లు ప్రారంభించినప్పుడు మాత్రం మానవ హక్కుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మావోయిస్టులకు రక్షణ కల్పించేది ఎందుకు? నిజంగా గిరిజనుల హక్కుల కోసం కృషి చేయాల్సింది వారు కాదా?’’ అని ప్రశ్నించారు.

నక్సలిజం అంతానికి గడువు

నక్సలిజానికి సైద్ధాంతిక, ఆర్థిక, చట్టపరమైన మద్దతు ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించడం అత్యవసరమని అమిత్‌ షా అన్నారు. వీటన్నింటినీ అరికట్టినప్పుడే మావోయిస్టు సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని దేశం నుంచి పూర్తిగా నిర్మూలిస్తామన్న నమ్మకం వ్యక్తం చేశారు.