భోపాల్: ఓ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కు గురయిన దారుణ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఒక్కసారి కాదు బాలికను రెండు సార్లు కిడ్నాప్ చేసిన యువకులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఐదు రోజుల వ్యవధిలోనే బాలికపై మూడు గ్యాంగ్ లు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాయి. 

వివరాల్లోకి వెళితే... మధ్య ప్రదేశ్ ఉమారియా జిల్లాకు చెందిన ఓ 13ఏళ్ల బాలికను ఈ నెల 4వ తేదీన ఓ యువకుడు కిడ్నాప్ చేశాడు. బాలికను ఓ గదిలో బంధించి తన ఆరుగురు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. పలుమార్లు ఇలా లైంగిక దాడికి పాల్పడి బాలికను వదిలిపెట్టారు. ఈ విషయం గురించి ఎవరికయినా చెబితే చంపేస్తామని బెదిరించడంతో భయపడిపోయిన బాలిక ఎవ్వరికీ చెప్పలేదు.

అయితే బాలిక ఎవ్వరికీ చెప్పకపోవడాన్ని అలుసుగా తీసుకుని ఈ నెల 11వ తేదీన మరో యువకుడు కిడ్నాప్ చేశాడు. అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి మరో ముగ్గురితో కలిసి బాలికపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఆ తర్వాత మరో ఇద్దరు ట్రక్‌ డ్రైవర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. 

చివరకు ఎలాగోలా ఈ కామాంధులందరి నుండి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులకు జరిగిన ఘోరం గురించి చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్కో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు... ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.