8 ఏళ్ల బాలికపై 9 ఏళ్ల బాలుడు అత్యాచారం.. కేసు నమోదు
ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిదేళ్ల బాలికపై తొమ్మిదేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇద్దరూ కలిసి ఓ ఫెయిర్‌కి కలిసి వెళ్లారు. అక్కడి నుంచి బాలికను ఆ బాలుడు సమీపంలోని అటవీ ప్రాంతానికి రాత్రిపూట తీసుకెళ్లి రేప్ చేశాడు. బాలిక తన తండ్రికి ఈ విషయం చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. లక్నోలో 8 ఏళ్ల బాలికపై 9 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక తన తండ్రికి చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడైనా 9 ఏళ్ల బాలుడు పారిపోయాడు. పోలీసులు బాలుడిని గుర్తించారు. అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన లక్నో సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చే ఏరియాలో మంగళవారం రాత్రి జరిగినట్టు పోలీసులు బుధవారం వెల్లడించారు.
‘కేసు నమోదు చేశాం. మైనర్ బాలికను వైద్య పరీక్షల కోసం హాస్పిటల్‌కు పంపించాం’ అని ఎస్‌హెచ్‌వో అతుల్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. ‘బాలుడిని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు గురువారం హాజరుపరిచాం. ఈ కేసులో తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి వారు ఆలోచనలు చేస్తున్నారు’ అని వివరించారు.
‘పీజీఐ సమీపంలోని అర్జున్ గంజ్ వద్ద ఆ బాలిక యాచిస్తుంది. అబ్బాయి సుశాంత్ గోల్ఫ్ సిటీ ఏరియా సమీపంలోనే నివసిస్తాడు. వీధిలో బెలూన్లు అమ్ముతుంటాడు. ఆ బాలిక, బాలుడు ఇద్దరూ పరిచయస్తులే. మంగళవారం రాత్రి ఆ ఏరియాలో నిర్వహించిన ఓ ఫెయిర్‌కు కలిసి వెళ్లారు. ఆ తర్వాత బాలుడు ఆ బాలికను తీసుకుని ఏకానా స్టేడియం వెనుకాలే ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే రేప్ చేశాడు’ అని ఎస్‌హెచ్‌వో వివరించారు.
ఆ బాలిక తండ్రికి జరిగిన దాని గురించి సమాచారం ఇచ్చింది. ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందిత బాలుడు ఆ వెంటే పారిపోయాడు. అయితే, పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీలోని సెక్షన్ 83 కింద 7 నుంచి 12 ఏళ్ల వయసులోని పిల్లలు ఏదైనా నేరానికి పాల్పడితే వారి మానసిక సామర్థ్యాన్ని బట్టి శిక్షలు, మన్నింపులు ఉంటాయి.