దేశవ్యాప్తంగా మోడీ గాలి వీచిన ఒడిషాలో నవీన్ పట్నాయక్ ముందు బీజేపీ ఆటలు సాగలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఐదో సారి ఆయనకు ప్రజలు అధికారాన్ని అందించారు. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ పాలనలో సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు.

రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. అలాగే మంత్రులందరూ ప్రతి నెల అమలు చేసిన పథకాల గురించి తనకు రిపోర్ట్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రతినెల ఏడో తేదీన మంత్రులందరూ రిపోర్ట్ పత్రాలను సీఎంవో కార్యాలయానికి పంపాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలి కేబినెట్ సమావేశంలోనే ఈ మేరకు నవీన్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజూ జనతాదళ్ అద్భుత విజయాన్ని సాధించి ఐదో సారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 142 స్థానాలకు గాను 112 స్థానాలను బీజూ జనతాదళ్ గెలుచుకుంది.