ప్రకృతి అందాలను చూసేందుకు వెళ్లిన తెలుగు పర్యాటకులు ప్రమాదానికి గురయ్యారు. మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తెలుగోళ్లు తీవ్రంగా గాయపడ్డారు.

Maharashtra Car Accident : వానాకాలంలో ఆకాశంలో నల్లని మేఘాలు, భూమిపై పరుచుకున్న పచ్చని అందాలతో ప్రకృతి చాలా రమణీయంగా ఉంటుంది. ఇక వాననీటితో జాలువారే జలపాతాలు, మన చేతికందే దూరంలో మేఘాలతో హిల్స్ స్టేషన్స్ అద్భుత అనుభూతిని ఇస్తాయి. ఇలాంటి ప్రకృతి అందాలను చూసేందుకు మహారాష్ట్రకు వెళ్ళిన తెలుగు పర్యాటకులు ప్రమాదానికి గురయ్యారు.

రాయ్ గడ్ జిల్లాల్లోని మాథేరాన్ హిల్ స్టేషన్ కు తెలుగు రాష్ట్రాల నుండి పర్యాటకులు వెళుతుంటారు. ఇలా ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన ఆరుగురు కారులో ఈ హిల్ స్టేషన్ కు వెళ్ళారు. అయితే వీరు కొండప్రాంతాల్లో వెళుతుండగా ఒక్కసారిగా కారు బ్రేకులు ఫెయిలయ్యాయి... దీంతో రెయిలింగ్‌ని ఢీకొట్టిన వాహనం అమాంతం గాల్లోకిలేచి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ కారులోనివారికి ఏం కాలేదు… ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా అందరూ సురక్షితంగా బైటపడ్డారు. కారు మాత్రం ధ్వంసం అయ్యింది. 

ఈ ప్రమాదం జుమాపట్టి రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది. కారు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి… దీంతో డ్రైవర్ కారుని నియంత్రించలేకపోయాడు. కారు ముందుకు దూసుకెళ్లి రెయిలింగ్‌ని ఢీకొట్టి బోల్తా పడింది. కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.

ప్రమాద సమయంలో కారులో ఇద్దరు పిల్లలు, ముగ్గురు అమ్మాయిలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరంతా గుంటూరు జిల్లాకు చెందిన సాకేత్ రామ్, త్రిలోక్, తేజస్విని, పూజిత, వైష్ణవి, తేజస్విగా గుర్తించారు. వీరంతా మాథేరాన్‌ విహారయాత్ర ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులకు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా గాయపడినవారిని రాయ్‌గఢ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం బోల్తాపడిన కారును రోడ్డు మద్యలోంచి తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.