జమ్మూకాశ్మీర్ పూంచ్ లో భారీ ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లు మృతి.. దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ
జమ్మూ కాశ్మీర్ లో పూంచ్ సెక్టార్ లో భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఈ దాడి దేశ వ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. అయితే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ తమ ఆధీనంలోకి తీసుకొని, దర్యాప్తు చేపట్టనుంది.
జమ్ముకాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో వాహనంలో మంటలు చెలరేగి ఐదుగురు జవాన్లు మృతి చెందారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఇది ఉగ్రదాడి అని భారత సైన్యం ధృవీకరించింది. దీంతో దేశమంతా ఒక్క సారిగా ఉలిక్కిపడింది. అయితే దీనిపై నేషనల్ ఇన్విస్టేగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించిందని ‘టైమ్స్ నౌ’ నివేదించింది.
ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు బుద్ధుడి బోధనలే పరిష్కారం - ప్రపంచ బౌద్ధ సదస్సులో ప్రధాని మోడీ
నార్తర్న్ కమాండ్ నివేదికల ప్రకారం.. సుమారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాజౌరీ సెక్టార్ లోని భీంబర్ గలీ, పూంచ్ మధ్య వెళుతున్న ఒక ఆర్మీ వాహనంపై గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దుండగులు గ్రెనేడ్లు ప్రయోగించడంతో వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఈ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం మోహరించిన రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ కు చెందిన ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని సైన్యం ధృవీకరించింది.
తీవ్రంగా గాయపడిన మరో జవానును వెంటనే రాజౌరీలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికులను హవ్ మన్దీప్ సింగ్, ఎల్/ఎన్ కే దేబాశిష్ బస్వాల్, ఎల్/ఎన్ కే కుల్వంత్ సింగ్, సెప్ హర్కిషన్ సింగ్, సెప్ సేవక్ సింగ్ గా గుర్తించారు.
పూంచ్ ఘటనపై ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వివరించారు. మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా సిబ్బంది డ్రోన్ నిఘా, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జైషే అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ఆర్మీ వాహనంపై దాడి చేసింది. అయితే పూంచ్ ఘటన కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తమ ఆధీనంలోకి తీసుకుంది. దీనిపై విచారణ చేపట్టనుంది. అందులో భాగంగా జమ్మూ నుంచి ఒక బృందాన్ని ఘటనా స్థలానికి పంపించింది.
ఈ ఘటనపై జమ్ముకశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘పూంచ్ లో జరిగిన విషాద సంఘటనలో ధైర్యవంతులైన ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. దేశానికి వారు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని సిన్హా పేర్కొన్నారు.
కాగా.. భట్టా ధురియాన్ లో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో బీజీ నుంచి సూరంకోట్ రోడ్డు వరకు రాకపోకలను నిలిపివేశారు. ప్రయాణీకులందరూ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. కాగా.. ఆర్మీ వాహనంపై పిడుగు పడిందని, దీంతోనే మంటలు చెలరేగి ఈ దుర్ఘటన జరిగి ఉండొచ్చని తొలుత వార్తలు వెలువడ్డాయి. కానీ తరువాత ఇది ఉగ్రదాడి అని సైన్యం తేల్చింది.