అతిక్ అహ్మద్ సమాధిపై త్రివర్ణ పతాకం పరిచిన కాంగ్రెస్ నేత.. భారతరత్న, అమరవీరుడి హోదా ఇవ్వాలంటూ కామెంట్స్
యూపీలో హత్యకు గురైన అతిక్ అహ్మద్ సమాధిపై ఓ కాంగ్రెస్ నాయకుడు జాతీయ జెండా పరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది.
హత్యకు గురైన గ్యాంగ్ స్టర్- రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ సమాధిపై యూపీకి చెందిన ఓ కాంగ్రెస్ నేత త్రివర్ణ పతాకాన్ని పరిచారు. అలాగే ఆయనకు భారత రత్న, అమరవీరుడి హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాదిపై జాతీయ జెండా పరిచిన సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. దీంతో ఆ కాంగ్రెస్ నేతను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రయాగ్ రాజ్ మున్సిపాలిటీలో 43వ వార్డు కార్పొరేటర్ అయిన రాజ్ కుమార్ సింగ్ అలియాస్ రజ్జూ ఓల్డ్ సిటీ ప్రాంతంలోని కసరి మసారీ శ్మశానవాటికలో ఉన్న అతిక్ అహ్మద్ సమాధిపై భారత త్రివర్ణ పతాకాన్ని ఉంచి వివాదాన్ని రేకెత్తించారు. జాతీయ జెండాను అతడి సమాధిపై పరుస్తూ ‘ అతిక్ భాయ్ అమర్ రహే’ అని ఆయన చెప్పడం ఓ వీడియోలో కనిపిస్తోంది. వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ధూమన్ గంజ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఏప్రిల్ 15 రాత్రి పోలీసు కస్టడీలో ఉన్న అతిక్, అతడి తమ్ముడు అష్రఫ్ లను ముగ్గురు సాయుధ దుండగులు కాల్చిచంపారు. మరుసటి రోజు ఏప్రిల్ 16వ తేదీన సాయంత్రం కసరి మసారీ శ్మశానవాటిక శ్మశానవాటికలో ఖననం చేశారు. ఆ సమాధిపై రజ్జూ జాతీయ జెండా పరిచారు. మరో వీడియోలో అతడు అతిక్ అహ్మద్ ను అమరవీరుడు అని పిలుస్తూ, ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
‘‘ఆయనకు భారతరత్న ఇవ్వాలి. ఆయన ప్రజాప్రతినిధి. ఆయనకు అమరవీరుడి హోదా ఇవ్వాలి. దివంగత ములాయం సింగ్ యాదవ్ కు పద్మవిభూషణ్ వస్తే అతిక్ కు భారతరత్న ఎందుకు ఇవ్వకూడదు. ఆయనకు ప్రభుత్వ లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు ఎందుకు జరపలేదు ?’’ అని ఆయన స్టేట్ మెంట్ ఇస్తుండగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆ నేతను మాట్లాడకుండా అడ్డుకున్నారు. ఇదిలావుండగా.. అతిక్ పై రాజ్ కుమార్ సింగ్ చేసిన ప్రకటన ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, దానితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ప్రదీప్ మిశ్రా అన్షుమన్ అన్నారు. ఆయనను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు.