Asianet News TeluguAsianet News Telugu

గాంధీల ఆశీస్సులతో ‘అధికారిక అభ్యర్థి’గా మల్లికార్జున్ ఖర్గే!.. శశిథరూర్ మరో జితేంద్ర ప్రసాదానేనా?

మల్లికార్జున్ ఖర్గే అధికారిక అభ్యర్థి అని నామినేషన్ వేసిన రోజే తేలిపోయిందని నిపుణులు చెబుతున్నారు. శశిథరూర్‌కు మద్దతు ఇచ్చే నేతలే కరువయ్యారంటేనే పార్టీ నిర్ణయం అంతర్గతంగా ఖరారైపోయిందని పేర్కొంటున్నారు. ఇందుకు 22 ఏళ్ల కిందటి సోనియా గాంధీ వర్సెస్ జితేంద్ర ప్రసాదా ఎన్నికతో పోలిక తెస్తున్నారు.
 

mallikarjun Kharge is an official candidate may be winning candidate with rival shashi tharoor
Author
First Published Oct 1, 2022, 5:44 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరిగి 20 ఏళ్లు దాటుతున్నది. అప్పటి నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేతిలోనే పార్టీ నడుస్తున్నది. మళ్లీ ఇప్పుడు ఎన్నిక నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం ఇద్దరు అభ్యర్థులు ఖరారయ్యారు. మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్‌లు పోటీ పడుతున్నారు. అయితే, ఈ ఎన్నిక కూడా 20 ఏళ్ల కింద జరిగిన ఎన్నికను గుర్తు చేస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. 22 ఏళ్ల క్రితం సోనియా గాంధీ, జితేంద్ర ప్రసాదా పోటీ చేశారు.

అప్పుడు కూడా సోనియా గాంధీ దాదాపు గెలిచే అభ్యర్థిగా ఉన్నారు. దాదాపు పార్టీ మొత్తం ఆమెకు మద్దతుగా ఉన్నది. కానీ, జితేంద్ర ప్రసాదా కూడా ఈ ‘అధికారిక అభ్యర్థి’ పై గెలువడం అసాధ్యమనే దాదాపు ఫిక్స్ అయ్యారు కూడా. సోనియా గాంధీని ఎంచుకోవడం కాకుండా.. ఎన్నుకునేలా ఉండాలనే కారణంతోనే ప్రసాదాను కూడా బరిలోకి దింపారనే విమర్శలు అప్పట్లో ఉండేవి.

ఇక తాజా ఎన్నిక విషయానికి వస్తే.. నిన్ననే నామినేషన్ల గడువు ముగిసింది. తాజాగా త్రిపాఠి నామినేషన్ తిరస్కరణతో అధ్యక్ష పోటీ శశిథరూర్, మల్లికార్జున్ ఖర్గేల మధ్య జరుగుతున్నది. నామినేషన్ ఉపసంహరించుకోకుంటే.. ఎన్నిక జరుగుతుంది. 

శశిథరూర్ రెబల్ గ్రూప్ సభ్యుడు. అంటే పార్టీలో సమూల ప్రక్షాళన కావాలని అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన 23 మంది నేతల్లో ఒకరు. మల్లికార్జున్ ఖర్గే గాంధీల విశ్వాసపాత్రుడు. అందుకే పార్టీలో మార్పులు కావాలంటే తనకు ఓటు వేయాలని శశిథరూర్ అంటున్నారు.

కేవలం నామినేషన్ల ప్రక్రియ 22 ఏళ్ల క్రితం ఎన్నికను గుర్తు చేస్తున్నది. మల్లికార్జున్ ఖర్గే ‘అధికారిక అభ్యర్థి’ అని తెలుపుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శశిథరూర్ నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు ఆయన వెనుక పెద్ద నేతలు లేరు. కేవలం కార్తీ చిదంబరం, సల్మాన్ సోజ్, సందీప్ దీక్షిత్ వంటి నాలుగురైదుగురు మినహా పెద్దగా మద్దతు కనిపించలేదు. నామినేషన్ పత్రాలు సమర్పించి బయటకు వస్తే.. ఆయనకు విలేకరులు మినహా మరెవరూ ఎదురుబడలేదంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. అక్కడి నుంచి నేరుగా ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వెళ్లి తన మ్యానిఫెస్టో చెప్పారు. మ్యానిఫెస్టోలోనూ ఇండియా చిత్రంపై కశ్మీర్ పూర్తిగా లేని కారణంగా వివాదం రేగింది. ఈ వివాదం నుంచి కూడా కాంగ్రెస్ దూరం పాటించింది. అది శశిథరూర్ టీమే వివరణ ఇవ్వాలని పేర్కొంది. 

ఆయన నామినేషన్ వేయడానికి బ్యాండ్‌లతో రాగా.. చిన్నపాటి బారాత్ మాత్రమే ఉన్నది. అసలు ఆ తిరుగుబాటు నేతలూ శశిథరూర్‌ను పక్కనపెట్టేశారు. మనీష్ తివారీ, ఆనంద్ శర్మ వంటివారు ఖర్గే వెంట కనిపించడం గమనార్హం.

అదే మల్లికార్జున్ ఖర్గే విషయానికి వస్తే ఈ పరిస్థితులు పూర్తిగా వేరుగా ఉన్నాయి. ఖర్గే నామినేషన్ వేయడానికి వస్తున్నప్పుడు ఒక్కసారిగా అక్కడి వాతావరణం మారిపోయింది. వేగమైన కదలికలు కనిపించాయి. మొసంబీల సంచులు జ్యూస్‌ల కోసం వచ్చాయి. సల్మాన్ ఖుర్షీద్, రాజీవ్ శుక్లా, కుమారి సెల్జా, అశోక్ గెహ్లాట్‌లు వచ్చేశారు. జ్యూస్‌లు, టీలతోపాటు మద్దతు ఎలా ఇవ్వాలి? నామినేషన్ వేయడం వంటి అంశాలపై హడావిడి కనిపించింది. దిగ్విజయ సింగ్, దీపేందర్ హుడాలు ఖర్గేతోపాటు వచ్చారు. ముకుల్ వాస్నిక్, ఇతర సీనియర్ నేతలు కాంగ్రెస్ ఆఫీసులో ఆయనను పలకరించారు.

చాలా మంది కాంగ్రెస్ నేతలు శశిథరూర్‌తో కనిపించడానికి ఇష్టపడలేదు. కానీ, ఖర్గే వెంటే గుంపుగా చేరిపోయారు. దీంతో ఇక్కడ శశిథరూర్ తన సొంత ఇష్టంతో నామినేషన్ వేయగా.. ఖర్గే మాత్రం అధికారిక అభ్యర్థి అని, ఆయన గెలుపే తథ్యం అనే అభిప్రాయాలు కలుగక మానవు.

Follow Us:
Download App:
  • android
  • ios