మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం మనిషనంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నివాసానికి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడం కలకలం రేపింది.

ముంబై నగరంలోని బాంద్రాలో ఉన్న ఉద్దవ్ వ్యక్తిగత నివాసం మాతోశ్రీకి శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో రెండుసార్లు ఈ ఫోన్ వచ్చింది. దావూద్ తరపున దుబాయ్ నుంచి మాట్లాడుతున్నానని.. ఉద్ధవ్‌తో దావూద్ బాయ్ మాట్లాడాలని అనుకుంటున్నారని ఫోన్‌లో వినిపించింది.

అయితే ఈ ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి సీఎంకు ఫోన్ ఇవ్వలేదు. ఈ కాల్‌పై ముఖ్యమంత్రి సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ఎలాంటి కేసూ నమోదు చేయలేదు.

ఫోన్ చేసిన వ్యక్తి ఎవరనేది తెలియరాలేదు. ఈ కాల్ నిజంగా దుబాయ్ నుంచే వచ్చిందా..? లేక మరేదైనా ప్రాంతం నుంచి వచ్చిందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.