లోక్‌సభలో విపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరిని స్పీకర్ ఓం బిర్లా సభ నుంచి సస్పెండ్ చేశారు. ప్రివిలేజ్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెన్షన్ అమల్లో వుంటుందని ఓం బిర్లా తెలిపారు.
లోక్‌సభలో విపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరిని స్పీకర్ ఓం బిర్లా సభ నుంచి సస్పెండ్ చేశారు. లోక్‌సభలో వికృత చర్యలకు పాల్పడ్డారని.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై స్పందించిన స్పీకర్.. అధిర్ రంజన్‌ను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రివిలేజ్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెన్షన్ అమల్లో వుంటుందని ఓం బిర్లా తెలిపారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా గురువారం అధిర్ రంజన్ మాట్లాడుతూ.. మోడీని హిందూ ఇతిహాసం మహాభారతంలోని ధృతరాష్ట్రుడితో పోల్చారు. ‘‘ధృతరాష్ట్రుడు అంధుడిగా ఉన్నప్పుడు ద్రౌపది బట్టలు తీసేశారు, నేటికీ రాజు గుడ్డివాడిగా కూర్చున్నాడు... మణిపూర్, హస్తినాపురం అనే తేడా లేదు’’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆర్ధిక నేరగాడు, ప్రస్తుతం విదేశాల్లో వున్న నీరవ్ మోడీతో ప్రధానిని పోల్చారు.
ALso Read: దేశం మీ వెంటే.. త్వరలోనే శాంతిని పునరుద్ధరిస్తాం : మణిపూర్ హింసపై నరేంద్ర మోడీ
అయితే అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలపై అధికార పక్షం భగ్గుమంది. ప్రధాని మోడీపై నిరాధారమైన ఆరోపణలను అంగీకరించేది లేదని జోషి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను అధిర్ తక్షణం వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చౌదరి సంయమనం పాటించాలని, సభను చక్కదిద్దాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పీకర్‌ను కోరారు. మరోవైపు.. అమిత్ షా ‘క్విట్ ఇండియా’ అంటూ వ్యాఖ్యానించడంపై చౌదరి స్పందించారు. క్విట్ ఇండియా తప్పక జరగాలని.. మతతత్వం నుంచి భారతదేశాన్ని విడిచిపెట్టాలని, కాషాయీకరణ నుంచి భారతదేశాన్ని విడిచిపెట్టండి అంటూ అధిర్ వ్యాఖ్యానించారు.
చౌదరి ప్రసంగిస్తుండగానే.. ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభకు వచ్చారు. దీనిని ఉద్దేశిస్తూ.. అవిశ్వాస తీర్మానం శక్తి ఈరోజు పార్లమెంట్‌కు ప్రధానిని తీసుకొచ్చిందన్నారు. అవిశ్వాస తీర్మానం గురించి తాము ముందుగా ఆలోచించలేదని, మోడీ పార్లమెంట్‌కు వచ్చి మణిపూర్ అంశంపై మాట్లాడాలని మాత్రమే తాము డిమాండ్ చేశామన్నారు. బీజేపీ సభ్యులెవరూ పార్లమెంట్‌కు రావాలని తాము డిమాండ్ చేయలేదని అధిర్ అన్నారు.
ALso Read: లోక్‌సభలో వీగిపోయిన విపక్షాల అవిశ్వాస తీర్మానం.. స్పీకర్ ప్రకటన
మణిపూర్‌లో హింస చిన్న సమస్య కాదని.. ఆ రాష్ట్రం జాతుల హింసను, అంతర్యుద్ధాన్ని ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. ఇది గ్లోబల్ డైమెన్షన్‌ను పొందిందని, ఇప్పటికే యూరోపియన్ పార్లమెంట్, అమెరికాలోనూ చర్చకు వచ్చిందని చౌదరి వెల్లడించారు. మణిపూర్ సమస్య ఏ రాష్ట్రానికీ పరిమితం కాదని, అందుకే ప్రధాని మోడీ జోక్యం అనివార్యమన్నారు.
