రాజ్యసభలో కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ, లడఖ్, జమ్మూ కాశ్మీర్ లను విభజిస్తూ సోమవారంనాడు బిల్లు పెట్టగానే రాజ్యసభలో జరిగిన రాద్ధాంతం మనమంతా చూసాం. కాశ్మీర్లో అక్కడక్కడా నిరసనలు వెల్లువెత్తాయి. అవిభాజ్య జమ్మూకాశ్మీర్ మొత్తంలోనూ ఈ నిరసనలు కనిపించాయనుకుంటే పొరపాటే. లడఖ్ ప్రాంతంలో మాత్రం సంబరాలు అంబరాన్నంటాయి. 

నిన్న లడఖ్ ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాడు. ఇతనేదో బిజెపి ఎంపీ కాబట్టి మాట్లాడాడు అనుకున్నప్పటికి అక్కడి ప్రజలందరూ, రాజకీయ నేతలతో సహా పార్టీలకు అతీతంగా తమ కల నెరవేరింది అని ముక్తకంఠంతో చెప్పారు. ఒక పక్కనేమో బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతాము అని ఒక ప్రాంతం వారు అంటుంటే ఇంకోపక్కనేమో చాలా ఆనందదాయకమైన విషయంగా పరిగణిస్తూ వేడుకలు చేసుకుంటున్నారు. అసలు ఎందుకు ఇలా? అక్కడి పరిస్థితులేంటో ఒకసారి తెలుసుకుందాం. 

 మామూలుగా అందరం కాశ్మీర్ గురించి మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా ఛానల్ చర్చ నిర్వహించినా కూడా అదంతా కేవలం కాశ్మీర్ లోయ గురించి, దాన్ని ఆనుకొని ఉన్న జమ్మూ ప్రాంతం చుట్టూ  మాత్రమే అంశాల గురించే మాట్లాడడం చూస్తాం. అంతేతప్ప, ఆ రాష్ట్రంలో 40శాతం భూభాగమైన లడఖ్ ప్రాంతం గురించి మాత్రం పెద్దగా పట్టించుకోము. ఆ ప్రాంత రాజకీయ ఆకాంక్షలను కూడా  గత ప్రభుత్వాలు పెద్దగా గౌరవించింది లేదు. 

లడఖ్ ప్రాంతం రెండు జిల్లాలుగా ఉంది. ఒకటి లేహ్ జిల్లా కాగా మరొకటి కార్గిల్ జిల్లా. లేహ్ ప్రాంతంలో బౌద్ధులు అధికంగా ఉంటారు. వారు మాట్లాడే భాష కూడా టిబెటన్ భాషకు దగ్గరగా ఉండే లాదాఖి. సాంస్కృతికంగా కూడా మిగిలిన కాశ్మీరీల కన్నా వీరు భిన్నం. ఎప్పుడైతే కాశ్మీర్ చివరి మహారాజు రాజా హరి సింగ్ భారత ప్రభుత్వంతో విలీన ఒడంబడిక చేసుకున్నాడో అప్పుడు లఢఖ్ ప్రాంతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పరిధిలోకి వచ్చింది. ఎప్పటినుండో కాశ్మీరులా కాకుండా లడఖ్ మాత్రం భారత్ తో మంచి సంబంధాలనే కొనసాగిస్తోంది. 

1947లో పాకిస్థాన్ ప్రేరేపిత వేర్పాటువాదుల దాడులలో లడఖ్ తన సర్వస్వాన్ని కోల్పోయింది. అప్పటికే భౌగోళికంగా విసిరివేయబడ్డట్టు ఉండడం, అప్పటి డోగ్రా రాజుల చేతిలో ఆర్థికంగా దశాబ్దాలుగా దోపిడీకి గురయ్యి ఉండడంతో లడఖ్ ప్రాంతానికి ప్రభుత్వ సహాయం అత్యవసరంగా మారింది. ఈ సహాయం అందుతుందనే ఆశతోనే కాశ్మీర్ భవితవ్యాన్ని తేల్చనున్న ( కాశ్మీర్ భరత్ తోని కలవాలా, లేక పాకిస్తాన్ తోనా, లేక స్వతంత్ర దేశంగా కొనసాగాలా అనే తీర్మానం చేయడానికి) రాజ్యాంగ అసెంబ్లీలో పాలుపంచుకుంది. 

ఇంత చేసినా కూడా ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలను పట్టించుకున్న నాథుడే లేదు. అవినీతిపరులైన అక్కడి కాశ్మీర్ అధికారుల చేతుల్లో వారు తీవ్ర స్థాయిలో దోపిడీకి గురయ్యారు.కాశ్మీరులో అప్పటి షేక్ అబ్దుల్లా ప్రభుత్వం  ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో లడఖ్ అభివృద్ధి గురించి ఒక్కటంటే ఒక్క ప్రత్యేక ప్రణాళిక కూడా లేదు. విస్తీర్ణం పరంగా కాశ్మీరులో మూడింట రెండొంతులుండే లడఖ్ ప్రాంతం గురించి పట్టించుకోకపోవడం శోచనీయం. మోడరన్ లడఖ్ శిల్పిగా పేరొందిన రింపూచె ఎలాగైనా ఈ విషయంపై గళమెత్తాలని నిశ్చయించుకొని అసెంబ్లీలో మాట్లాడడానికి స్పీకర్ నుండి అనుమతి పొందాడు. 

ఆయన మాటలను వింటే ఎలా లడఖ్ కు అన్యాయం జరిగిందో మనకు అర్థమవుతుంది. లాదాఖి భాషను కాదని ఉర్దూను బోధనా మాధ్యమంగా చేశారు. దీనితో భాష అంధకారంలోకి నెట్టివేయబడింది. పాక్ ప్రేరేపిత వేర్పాటువాదుల దాడుల్లో సర్వస్వం కోల్పోయిన వారు హిమాచల్ ప్రదేశ్ లోని కులు ప్రాంతంలో బిచ్చగాళ్లుగా మిగిలిపోయారు. అప్పటి కాశ్మీర్ బడ్జెటులో 25 లక్షలను కాలువలు తవ్వడానికి కేటాయించగా అందులో ఒక్కటి కూడా ఈ ప్రాంతానికి దక్కలేదు. వారుగనుక గళమెత్తితే బయట దేశాలకు చెందిన విచ్చిన్నకర శక్తులు వారితో మాట్లాడిస్తున్నాయని అనేది అప్పటి కాశ్మీర్ సర్కార్. 

"ఆకలితోని అలమటిస్తూ అన్నమో రామచంద్ర అని అరిచేవాడికి వేరే శక్తులు అరవమని కొత్తగా నేర్పాలా? శ్రీనగర్ నుంచి బట్టలు మా ప్రాంతానికి సరఫరా చేస్తే అవి మాకు అందక నగ్నంగా ఒక పక్క చలికి చివురుటాకుల్లా వణుకుతూ, వేడికి కాలుతూ ఉన్నవాడికి వాడి బాధను వెళ్లబోసుకోమని కూడా బయటి శక్తులు నేర్పాలా? మాకేమో కిరోసిన్ సరఫరా చేశామని చెబుతారు. కానీ మేము మాత్రం ఆకాశాన్నంటే ధరలకు ఒక్కో సీసాడు కిరోసిన్ కొనుగోలు చేసి ఇది పరిస్థితి అని అనకూడదా ??" అంటూ రింపూచె అసెంబ్లీలో ధాటిగా ప్రసంగించాడు. ఇదేదీ అర్థం కాని మిగిలినవారు జనాబ్ అనే గౌరవ వాచకం వాడగానే అతనేదో వారిని పొగుడుతున్నాడనుకొని బల్లలు కొడుతూ కేరింతలు వేశారు. 

ఈ ప్రసంగం ఢిల్లీని కదిలించింది. ఈ ఆరోపణలపైన అప్పటి నెహ్రు ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ఇవన్నీ ఆరోపణులు మాత్రమే కాదు, పచ్చి నిజాలు అని తెలియడంతో లడఖ్ కు భారత రాజ్యాంగానికి లోబడి ఎక్కువ స్వయం ప్రతిపత్తిని ఇవ్వడానికి పూనుకున్నప్పటికీ, అది కలగానే మిగిలింది. 

ఆర్థికంగా, సాజికంగా, సాంస్కృతికంగా దోపిడీ కి గురవుతూ ఉన్న అక్కడి ప్రజలు నిన్నటి ప్రభుత్వ ప్రకటనతో సంబరాలు జరుపుకుంటున్నారు. వారి రాజకీయ ఆకాంక్షలను ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించిందని సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

కాశ్మీర్ విభజన బిల్లు: లోక్‌సభ నుండి టీఎంసీ వాకౌట్

కాశ్మీర్ విషయంలో భారత్ విజయం... పాక్ కి లభించని మద్దతు

సొంత పార్టీకి షాక్.. కేంద్రం నిర్ణయానికి జైకొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

లోక్‌సభలో కాశ్మీర్ విభజన బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా