జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్...  భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనచేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. 

CJI BR Gavai Sworn : జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ 52వ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని అధిష్టించిన తొలి బౌద్ధుడు, రెండవ షెడ్యూల్డ్ కులాల న్యాయమూర్తిగా ఈయన నిలిచారు. జస్టిస్ గవాయ్ తో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. 

Scroll to load tweet…

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణతో జస్టిస్ బి.ఆర్. గవాయ్ ఆ బాధ్యతలు చేపట్టారు. ఈయన ఆరు నెలలకు పైగా అంటే నవంబర్ 23, 2025 వరకు చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు. జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ తర్వాత షెడ్యూల్డ్ కులాల నుండి ప్రధాన న్యాయమూర్తి అయిన రెండవ వ్యక్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్.

ఎవరీ జస్టిస్ గవాయ్ :

భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ బి.ఆర్. గవాయ్ 1960, నవంబర్ 24 లో మహారాష్ట్రలో జన్మించారు. ఆయన స్వస్థలం అమరావతి. ఈయన తండ్రి దివంగత ఆర్. ఎస్. గవాయ్ ప్రముఖ సామాజిక కార్యకర్త. బిహార్, కేరళ రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా పనిచేసారు. 

జస్టిస్ బి.ఆర్. గవాయ్ న్యాయశాస్త్రంపై మక్కువతో లా చదువుకున్నారు. 1985 లో న్యాయవాది రాజా ఎస్. బోంస్లే వద్ద న్యాయ వృత్తిని ప్రారంభించారు. 1987లో బాంబే హైకోర్టులో స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. రాజ్యాంగ, పరిపాలనా చట్టంపై దృష్టి సారించారు.

నవంబర్ 14, 2003న అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నవంబర్ 12, 2005న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 15 సంవత్సరాలకు పైగా ముంబై, నాగ్‌పూర్, ఔరంగాబాద్, పనాజీలలో బెంచ్‌లకు అధ్యక్షత వహించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆయనను తదుపరి సిజెఐగా కొలిజియం సిపారసు చేసింది. దీనికి కేంద్ర కేబినెట్, రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఇవాళ(బుధవారం) అధికారికంగా ఆయన బాధ్యతలు చేపట్టారు.