సారాంశం
హైకోర్టు ఆదేశాల ఉల్లంఘనపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. ఏపీ డిప్యూటీ కలెక్టర్ను తహసీల్దార్‌గా డిగ్రేడ్ చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను లెక్క చేయని అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఒక డిప్యూటీ కలెక్టర్‌ను తహసీల్దార్ హోదాకు డీమోట్ చేయాలని . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2013లో గుడిసెల తొలగింపుపై హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను గౌరవించకుండా, 2014 జనవరిలో గుంటూరు జిల్లాలో గుడిసెలను బలవంతంగా తొలగించారు. దీనిపై సుప్రీం కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.
న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, ఆగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం, సంబంధిత అధికారి హైకోర్టు ఆదేశాలను "పూర్తిగా ఉల్లంఘించినట్లు" వ్యాఖ్యానించింది. అధికారిని 2023లో డిప్యూటీ కలెక్టరుగా ప్రమోట్ చేశారు. కానీ అతను అప్పట్లో తహసీల్దార్‌గా ఉన్న సమయంలో ఈ ఉల్లంఘన జరిగింది.
"న్యాయస్థానాల ఆదేశాలను అమలు చేయకపోవడం మన ప్రజాస్వామ్యం ఆధారపడిన న్యాయ పరిపాలనా వ్యవస్థ పునాదులకే సవాల్ విసరడం లాంటిది" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏ స్థాయిలో ఉన్న అధికారైనా న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించాల్సిందేనని తేల్చిచెప్పింది.
గతంలో హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించగా, సుప్రీంకోర్టు శిక్షను సవరించి, డిమోషన్, ₹1 లక్ష జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. “మేము కొంత శాంతంగా వ్యవహరించినా, ఎవరూ న్యాయ వ్యవస్థపై తిరుగుబాటు చేయలేరు అన్న సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది” అని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ కేసు 2013 డిసెంబర్ 11న హైకోర్టు ఇచ్చిన గుడిసెల తొలగింపుపై నిషేధాన్ని సంబంధిత అధికారి ఉల్లంఘించాడని వచ్చిన ఫిర్యాదుతో ప్రారంభమైంది. సుప్రీంకోర్టు విచారణలో, అధికారులు పదవీచ్యుతాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని వాదించారు.
తుది తీర్పులో, “న్యాయవ్యవస్థను అపహాస్యం చేసే ధోరణిని సహించబోమన్న సందేశం దేశమంతటా వెళ్లాల్సిన అవసరం ఉంది” అని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. తీర్పు ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ని తహసీల్దార్‌గా పదవీచ్యుతం చేయాలి. అలాగే విధించిన జరిమానా రికవరీ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.