న్యూఢిల్లీ: బిజెపి నేతల విద్వేషపూరిత ప్రసంగాల వీడియోలను చూసి వారిపై వెంటనే ఎఫ్ఐఆర్ లు నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఇటువంటి కేసుల్లో వెంటనే ప్రతిస్పందించకపోవడంపై హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. 

నలుగురు బిజెపి నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, అభియ్ వర్మ, పర్వేష్ వర్మల ప్రసంగాల వీడియోలను ఉత్కంఠతో చూసిన తర్వాత హైకోర్టు బుధవారం సాయంత్రం ఆ ఆదేశాలు జారీ చేసింది. కోర్టులోనే ఆ వీడియోలను చూశారు. 

Also Read: రెచ్చగొట్టే ప్రసంగాలు: హైకోర్టులో మరో ఇద్దరు బిజెపి నేతల వీడియోలు

అల్లర్లను ప్రోత్సహించిన, అల్లర్లకు పాల్పిడనవారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వరుసగా బుధవారం నాలుగో రోజు ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 23 మంది మరణించగా, 200 మంది దాకా గాయపడ్డారు. 

ఆస్తి నష్టం కలిగించినవారిపై, అల్లర్లకు పాల్పడినవారి పట్ల పోలీసులు అలసత్వం ప్రదర్శించారని హైకోర్టు మండిపడింది. ఈ ప్రసంగాలు చేసినందుకు ఎందుకు ఎఫ్ఐఆర్ లు నమోదు చేయలేదని, నేరానికి అవకాశం ఉందని గుర్తించలేదా జస్టిస్ మురళీధర్ ప్రశ్నిస్తూ ఎఫ్ఐఆర్ లు నమోదు చేయండని ఆదేశించారు. 

Also Read: ప్రజలు సంయమనం పాటించాలి: ఢిల్లీ అల్లర్లపై మోడీ

ఈ వీడియోల గురించి మాత్రమే కాదు, అటువంటి ప్రసంగాలున్న అన్ని వీడియోలను కమిషనర్  దృష్టికి తీసుకుని రావాలని హైకోర్టు సూచించింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినవారిపై వెంటనే ఎఫ్ఐఆర్ లు నమోదు చేయాలని హైకోర్టు కమిషనర్ అమూల్య పట్నాయక్ ను ఆదేశించారు. 

లలిత కుమారి మార్గదర్శక సూత్రాలను పాటించాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం వల్ల సంభవించిన పరిణామాలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని, చట్టానికి ఎవరూ అతీతులు కారని హైకోర్టు కమిషనర్ కు సూచించింది. తమ తీవ్రమైన ఆసంతృప్తిని పోలీసు కమిషనర్ కు తెలియజేయాలని హైకోర్టు పోలీసుల తరఫున హాజరైన మెహతాకు సూచించింది.