న్యూఢిల్లీ: దేశంలో మరో 1984 జరగకుండా చూడాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ అన్నారు. నాలుగో రోజు కూడా హింస చెలరేగుతున్న నేపథ్యంలో దాన్ని తిప్పికొట్టడానికి చర్యలు తీసుకోవాలని, కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు సూచించారు. 

ఢిల్లీ అల్లర్లలో 21 మంది మరణించారు. నిఘా విభాగం అధికారి అంకిత్ శర్మ మృతదేహం మురికి కాలువలో పడి ఉంది. నిఘా విభాగం అధికారి మృతి పట్ల హైకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఓ నిఘా విభాగం అధికారి మరణించినట్లు తెలిసిందని, ఇటువంటి సంఘటనలపై వెంటనే దృష్టి సారించాలని చెప్పింది.

Also Read: ప్రజలు సంయమనం పాటించాలి: ఢిల్లీ అల్లర్లపై మోడీ

ఢిల్లీ అల్లర్లపై మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో పోలీసులపై హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. విచారణను తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. 

హైకోర్టులో ఇప్పటికే కపిల్ మిశ్రా వీడియోను ప్రదర్శించగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన అనురాగ్ ఠాకూర్, పర్వేష్ వర్మ ప్రసంగాల వీడియోలను కూడా ప్రదర్శించారు. 

Also Read: ఢిల్లీ అల్లర్లు: మురికి కాలువలో నిఘా విభాగం అధికారి మృతదేహం

ఢిల్లీ శాసనసభ ఎన్నికల సందర్భంగా రెచ్చగొట్టే ప్రసంగం చేసిన బిజెపి నేత పర్వే,్ వర్మ వీడియోను కూడా హైకోర్టులో ప్రదర్శించారు. దేశద్రోహులను కాల్చి పారేయండని పిలుపునిచ్చిన బిజెపి ఎంపీ అనురాగ్ ఠకూర్ వీడియోను సైతం ప్రదర్శించారు. 

ఈశాన్య ఢిల్లీలోని పది, 12 తరగతుల విద్యార్థులకు కొత్త పరీక్ష తేదీలపై సాయంత్రం 5 లోగా నిర్ణయం తీసుకుని సాయంత్రం 6 లోగా ప్రజలకు తెలియజేయాలని ఆదేశించింది.

ఇదిలావుంటే, ఢిల్లీ అల్లర్లలోని మృతుల సంఖ్య 23కు చేరుకుంది. 200 మంది దాకా గాయపడ్డారు. ఐదుగురు ఐపిఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది.