కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అందులో భాగంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక హామీలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల హామీలతో కూడా మేనిఫెస్టోను జేడీ(ఎస్) విడుదల చేసింది. ఇందులో అనేక ప్రజాకర్షక వాగ్ధానాలు ఇచ్చింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం మాజీ ప్రధాని, జేడీఎస్ సీనియర్ నేత హెచ్ డీ దేవెగౌడ శనివారం బెంగళూరులో 12 అంశాల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో ఓటర్లకు వరాల జల్లు కురుపించారు. స్త్రీశక్తి గ్రూపులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని, ఏడాదికి ఐదు ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని అందులో ప్రకటించారు. గర్భిణులకు ఆరు నెలల పాటు రూ.6,000 భృతి (మొత్తంగా రూ.36 వేలు) ఇస్తామని, వితంతు పెన్షన్ రూ.900 నుంచి రూ.2,500కు పెంచుతామని, 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు.

కర్ణాటక ఎన్నికల్లో ట్విస్ట్.. కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా రిలీజ్..కోలార్ నుంచి సిద్ధరామయ్యకు దక్కని టికెట్

అలాగే రైతులకు ఎకరాకు రూ.10 వేల సబ్సిడీ ఇవ్వాలని మేనిఫెస్టోలో జేడీఎస్ పేర్కొంది. వ్యవసాయ కూలీలకు నెలకు రూ.2 వేల భృతి, వ్యవసాయం చేసే యువకులను పెళ్లి చేసుకునే మహిళలకు రూ.2 లక్షలు, వివిధ సివిల్ సర్వీసెస్, డిఫెన్స్ రిక్రూట్మెంట్లకు కన్నడలో పరీక్షలు నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే ప్రైవేటు రంగంలో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించేలా చట్టం తెస్తామని పేర్కొంది. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న 60 వేల మంది విద్యార్థినులకు 6.8 లక్షల సైకిళ్లు, ఈవీ మోపెడ్లను ఉచితంగా పంపిణీ చేస్తామని పేర్కొంది. ప్రతీ జిల్లాలో ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ నిర్మిస్తామని జేడీఎస్ హామీ ఇచ్చింది.

కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి, 12 మంది పరిస్థితి విషమం.. బీహార్ లో ఘటన

జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఈ సారి జేడీఎస్ అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందుకే దేవెగౌడ కోడలు భవానీ రేవణ్ణకు టికెట్ ఇచ్చే విషయంలో కుటుంబ కలహాలను జేడీఎస్ త్వరగానే పరిష్కరించుకుంది. చివరకు పార్టీ నేత స్వరూప్ ప్రకాశ్ కు టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. జేడీఎస్ ఇప్పటి వరకు అభ్యర్థుల రెండు జాబితాలను విడుదల చేసింది. అందులో 142 మంది పేర్లను పార్టీ ప్రకటించింది. ఇంకా 82 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

కర్ణాటకలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ.. ఎన్నికల బరిలోకి మిత్రపక్షం ఎన్సీపీ..

కర్ణాటకలో అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత అధికార బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్ని స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. దీని కోసం మే 13వ తేదీన నోటిఫికేషన్ వెలువడింది. మే 10న పోలింగ్ నిర్వహించనున్నారు. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్నాయి.