రాష్ట్రాల రాజకీయాల్లో గవర్నర్లు పోషిస్తున్న పాత్రపై సుప్రీం కోర్టు తన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికైన ప్రభుత్వాల పతనాన్ని వేగవంతం చేసే అంశంలో వారు భాగం కావడం బాధకరమని పేర్కొంది.
ఎన్నికైన ప్రభుత్వాల పతనాన్ని వేగవంతం చేయడానికి గవర్నర్లు రాజకీయ ప్రక్రియల్లో నిమగ్నం కావడం చాలా బాధాకరమని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్లు క్రియాశీలక పాత్ర పోషిస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది జూన్ 30న అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను బలపరీక్షకు ఆదేశించాలని అప్పటి మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోషియారీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ప్రస్తావించింది.
అనుమానాస్పద గూఢచారి పావురం.. వారం వ్యవధిలో రెండోది.. అప్రమత్తమైన అధికారులు
కాంగ్రెస్, ఎన్సీపీ సహకారంతో ఏర్పడిన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వానికి మద్దతు వెనక్కి తీసుకుంటున్నామని శివసేన పేర్కొందనే వాదనను ధృవీకరించడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. ‘‘ఉద్దవ్ ఠాక్రేను విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని కోరడం వల్ల ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు ఏర్పడుతాయనే స్పృహ గవర్నర్ కు ఉండాల్సింది. శివసేన ఎమ్మెల్యేలు తమ నాయకుడిపై అసంతృప్తితో ఉంటే, వారు నాయకుడిని మార్చవచ్చు. కానీ పార్టీలో విభేదాల కారణంగా సీఎం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని గవర్నర్ చెప్పగలరా? విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని సీఎంను కోరే గవర్నర్ అధికారాన్ని మేము ప్రశ్నించడం లేదు. కానీ సమస్య ఏమిటంటే ఒక ప్రభుత్వ పతనాన్ని వేగవంతం చేసే ప్రక్రియలో గవర్నర్ భాగం కాకూడదు.’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పార్లమెంట్ సమావేశాలు.. పలువురు కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశం..!!
అయితే గత గవర్నర్ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం చేసిన ఈ వాదనను తోసిపుచ్చారు. 39 మంది రెబల్ ఎమ్మెల్యేలు గవర్నర్ కు లేఖ రాశారని, అందులో తాము ఎంవీఏ ప్రభుత్వంలో భాగం కావాలనుకోవడం లేదని, తమ మద్దతును నిలిపివేయాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారని చెప్పారు. ‘‘ఎన్నికైన ప్రభుత్వం తన జీవితకాలంలో సభలో మెజారిటీ మద్దతును పొందడమే కాకుండా ఎప్పటికీ కొనసాగించాలనే రాజ్యాంగ ఆదేశాన్ని గవర్నర్ పాటించారు. ప్రభుత్వానికి మెజారిటీ మద్దతుపై సందేహాలు వచ్చినప్పుడల్లా వీలైనంత త్వరగా బలపరీక్షకు పిలవాలని సుప్రీంకోర్టు తీర్పులు ఆదేశించాయి’’ అని మెహతా పేర్కొన్నారు.
ఏడో తరగతి బాలికపై స్నేహితుడి తండ్రి అత్యాచారం.. మనస్థాపంతో బాధితురాలి ఆత్మహత్య..
అయితే రెబల్స్ చెప్పినట్లు ప్రభుత్వాన్ని కూలదోయాలంటే సంకీర్ణాన్ని వీడి ఉండాల్సిందని కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నర్ వారిని (రెబల్స్) నిజమైన వర్గంగా ఎలా గుర్తించారు? మూడేళ్ల పాటు రెబల్ ఎమ్మెల్యేలు సంకీర్ణంలో ఉన్నారు. అకస్మాత్తుగా రాజకీయ వివాహాన్ని నాశనం చేయడానికి ఏం జరిగింది’’ ధర్మాసనం ప్రశ్నించింది. కాగా.. గురువారం కూడా చర్చ కొనసాగనుంది.
