Bhubaneswar: ఒడిశాలోని పూరీ జిల్లాలో అనుమానాస్పద గూఢచారి పావురం లభ్యమైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. మార్చి 8న జగత్‌సింగ్‌పూర్ జిల్లా పారాదీప్ తీరంలో మత్స్యకార బోటు నుంచి ఇలాంటి పావురం పట్టుబడింది. రాష్ట్రంలో వారం వ్యవధిలో ఇది రెండో ఘటన అని అధికారులు తెలిపారు.
Suspected spy pigeon found in Odisha: ఒడిశాలో మరోసారి స్పై పావురం కలకలం రేపింది. వారం వ్యవధిలోనే నిఘాకు ఉపయోగిస్తున్నట్టుగా ఉన్న మరో పావురాన్ని గుర్తించారు. దీనిపై విచారణ జరుగుతున్నదని అధికారులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. ఒడిశాలోని పూరీ జిల్లాలో అనుమానిత గూఢచారి పావురాన్ని పోలీసులు గుర్తించారు. మార్చి 8న జగత్‌సింగ్‌పూర్ జిల్లా పారాదీప్ తీరంలో మత్స్యకార బోటు నుంచి ఇలాంటి పావురం పట్టుబడింది. రాష్ట్రంలో వారం వ్యవధిలో ఇది రెండో ఘటన అని అధికారులు తెలిపారు. పూరీ జిల్లాలోని అస్తరంగ్ బ్లాక్ లోని నాన్ పూర్ గ్రామంలో బుధవారం ఈ కొత్త పావురాన్ని పట్టుకున్నారు. ఇతర పావురాలతో కలిసేందుకు వచ్చిన త ఆ పావురాన్ని స్థానికులు గుర్తించి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాని కాళ్లకు ఇత్తడి, ప్లాస్టిక్ ఉంగరాలతో కూడిన ట్యాగ్ లు అతికించారు. ఒక ట్యాగ్ పై 'రెడ్డి వీఎస్పీ డీఎన్ (REDDY VSP DN) ' అని, మరో ట్యాగ్ పై 31 నంబర్ ఉందని అధికారులు తెలిపారు. ఈ పావురం వారం రోజులుగా ఆ ప్రాంతంలో ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు.
'మా ఇంట్లో పెంపుడు పావురాలు ఉన్నాయి. ఈ పావురం మా పావురాలతో కలిసిపోయింది. అయితే, దానిలో ఒక ప్రత్యేకతను గుర్తించాము. ఎందుకంటే మా పావురాలతో కలుస్తున్నప్పటికీ.. కాస్త దూరంగా ఉంటోంది. ఇతర పావురాలతో స్వేచ్ఛగా తిరగడం లేదు. అలాగే, దాని కాళ్లపై కొన్ని ట్యాగ్ లు కూడా కనిపించాయి. అందుకే దాన్ని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాం' అని పావురాన్ని పట్టుకున్న బిక్రమ్ పతి తెలిపారని వార్తాసంస్థ పీటీఐ నివేదించింది. ఈ పావురాన్ని కూడా గూఢచర్యానికి ఉపయోగిస్తున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కాగా, అంతకుముందు కూడా ఒడిశాలో గూఢచర్యం కోసం ఉపయోగిస్తున్న పావురాన్ని అధికారులు గుర్తించారు. మార్చి 8న పట్టుబడిన పావురానికి కెమెరా, మైక్రోచిప్ వంటి పరికరాలు అమర్చారు. దీనిని పరీక్షల నిమిత్తం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్)కు పంపించారు. దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియకముందే.. మరో నిఘాకు ఉపయోగిస్తున్న అనుమానాలు కలిగించే మరో పావురం వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
