న్యూఢిల్లీ: డిల్లీలోని సర్వోదయ స్కూల్ ను సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ మాట్లాడారు. తన భారత పర్యటన మరిచిపోలేనిదని, ఇది తన తొలి భారత పర్యటన అని ఆమె చెప్పారు. హ్యాపినెస్ స్కూల్ చాలా బాగుందని, అవగాహనతో కూడిన విద్యను అందిస్తున్నారని ఆమె అన్నారు. 

 

"నమస్తే! ఇది సుందరమైన పాఠశాల, సంప్రదాయ నృత్యప్రదర్శనలతో నాకు స్వాగతం చెప్పినందుకు ధన్యవాదాలు. ఇది నా తొలి భారత పర్యటన. ఇక్కడి ప్రజలు అత్యంత ఆదరణీయులు, దయగలవారు" అని ఆమె అన్నారు. 

 

అమెరికాలో తాను ఈ పద్ధితిలోనే పిల్లలతో తన బీ బెస్ట్ ఇన్సియేటివ్ ద్వారా పనిచేస్తానని ఆమె చెప్పారు. బీ బెస్ట్ లో మూడు ప్రధాన లక్ష్యాలున్నాయని, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఆన్ లైన్ భద్రత, మొత్తంగా పిల్లల బాగు అనేవి ఆ మూడు లక్ష్యాలని ఆమె చెప్పారు.  

 

సర్వోదయ స్కూల్లో మెలానియా ట్రంప్ విద్యార్థులతో ముచ్చటించారు. హ్యాపినెస్ క్లాస్ లను సందర్శించారు. తమ పెయింటింగ్స్ పట్టుకుని నిలబడిన పిల్లలతో ఫొటోలుదిగారు. దాదాపు గంట సేపు ఆమె పాఠశాలలో గడిపారు.