దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్ర కలకలం రేగింది. ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్న దంపతులను ఢిల్లీ స్పెషల్ పోలీసులు ఆదివారం ఓక్లా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని జహన్‌జీవ్ సామి, అతని భార్య హిండా బషీర్ బేగ్‌గా గుర్తించారు.

Also Read:పుల్వామా దాడి: టెర్రరిస్టులకు సహకరించిన తండ్రీకూతుళ్ల అరెస్టు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులిద్దరూ సీనియర్ ఐఎస్ సానుభూతిపరులపై సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాద దాడులు చేసేలా వీరిద్దరూ పలువురు ముస్లిం యువకులను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారు.

దంపతులిద్దరూ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న ఐఎస్ సభ్యులతో సన్నిహితంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరి అరెస్ట్‌ను ధృవీకరించిన ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమీషనర్ ప్రమోద్ సింగ్ మాట్లాడుతూ.. ఓఖ్లాలోని జామియా నగర్ నుంచి జహన్‌జీబ్ సామి, హిండా బషీర్ బేగ్ జంట సీఏఏ వ్యతిరేక అల్లర్లను ప్రేరేపిస్తున్నారని ఆయన చెప్పారు.

Also Read:రిపబ్లిక్ డే: ఢిల్లీలో భారీ విధ్వంసానికి కుట్ర, ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్

పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్‌‌కు వ్యతిరేకంగా ఎక్కువ మంది వ్యక్తులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇండియన్ ముస్లిం యునైటెడ్ అనే సోషల్ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌ను ఈ జంట నడుపుతోందని కమీషనర్ తెలిపారు. అంతేకాకుండా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో  భార్యాభర్తలిద్దరూ ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.