శ్రీనగర్: పుల్వామా దాడిలో ఉగ్రవాదులకు సహకరించిన వ్యక్తిని, అతని కూతురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) మంగళవారం అరెస్టు చేసింది. పుల్వామాలో ఉగ్రవాదులు చేసిన కిరాతకమైన దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. 

అరెస్టయిన ఇద్దరిని పీర్ తారిఖ్, అతని కూతురు ఇన్షాగా గుర్తించారు 2019 ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన దాడి వెనక కుట్రపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. జైషే మొహమ్మద్ ఉగ్రవాది అదిల్ అహ్మద్ దర్ బాంబులు పెట్టిన కారును సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును ఢీకొట్టాడు. దాంతో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. 

దార్ చివరిసారిగా మాట్లాడిన వీడియోను ఉగ్రవాద దాడి తర్వాత జైషే మొహమ్మద్ పాకిస్తాన్ లో విడుదల ేచసింది. దక్షిణ కాశ్మీర్ లోని పుల్వామాలో ఆ వీడియోను రికార్డు చేశారు.  

హక్రిపోరాకు చెందిన పీర్ తారిఖ్ పుల్వామాలో టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. పుల్వామా దాడికి ప్రణాళిక రచించేందుకు ఉగ్రవాదులకు అతను ఆశ్రయం కల్పించినట్లు ఆరోపిస్తున్నారు. 

తారీఖ్ నివాసంలో పాకిస్తాన్ టెర్రరిస్టు, ఐఈడి తయారీదారు ఉమర్ ఫరూఖ్, కమ్రాన్ (ఆ తర్వాత భద్రతా బలగాలతో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించాడు), పుల్వామాకు చెందిన జైషే మొహమ్మద్ టెర్రరిస్టు సమీర్ అహ్మద్ దార్, పాకిస్తానీ టెర్రరిస్టు మొహమ్మద్ ఇస్మాయిల్ లకు ఆశ్రయం పొందినట్లు గుర్తించారు. 

పుల్వామా దాడి తర్వాత విడుదల చేసిన అదిల్ అహ్మద్ దార్ వీడియోను కూడా తారీఖ్ నివాసంలోనే రూపొందించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. తారఖీ కూతురు ఇన్షా జాన్ నిందితులకు ఆహారం సరఫరా చేయడంతో వారికి అవసరమైన సమాచారాన్ని సమకూర్చినట్లు తేలింది.