Indian Navy : ఆపరేషన్ సింధూర్‌లో భారత నౌకాదళం సామర్థ్యం, వ్యూహాత్మక సంకల్పాన్ని చూపించి దేశ భద్రతలో కీలకపాత్ర పోషించింది. శత్రు దేశాలకు ఒక హెచ్చరికను పంపింది.

Indian Navy showcases maritime dominance: ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్‌గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల మధ్య సమన్వయంతో కొనసాగిన ఒక ముఖ్యమైన రక్షణ చర్యగా నిలిచింది. ఈ ఆపరేషన్ ద్వారా భారతదేశం తన సముద్రాధిపత్యాన్ని మళ్లీ ప్రపంచానికి ఋజువు చేసింది. 

కేవలం ఇది ఉగ్రవాదులపై దాడి టార్గెట్ గానే కాకుండా శత్రుదేశాలకు భారత్ నుంచి వచ్చిన ఒక హెచ్చరికగా నిలిచింది. పాకిస్తాన్ కు భారత్ తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో స్పష్టంగా తెలియజేసింది. అలాగే, చైనా కు సైతం మన సైనిక సామర్థ్యంలో ఎలాంటిదో ఆ ఆపరేషన్ సింధూర్ తో చూపించింది.

ఆపరేషన్ సింధూర్ క్రమంలో తాజాగా నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠి మాట్లాడుతూ.. “భారత నౌకాదళానికి చెందిన నౌకలు, జలాంతర్గాములు, వాయుసేన విమానాలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండి, ఏవైనా పాకిస్తాన్ చర్యలకు సముద్ర పరిధిలో తగిన స్పందన చూపించగలిగే స్థాయిలో ఉన్నాయన్నాయని” చెప్పారు.

ఉగ్రసంఘాల స్థావరాలపై సమిష్టి దాడులు

భారత నౌకాదళం, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద సంస్థల స్థావరాలపై సమన్వయిత దాడులు జరిపాయి. ఇందులో జైషే మహ్మద్, లష్కరే తోయ్బా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి తీవ్రవాద గ్రూపుల తొమ్మిది స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో 100కిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆ ఆపరేష్ సింధూర్ ను చేపట్టింది. ఉగ్రవాదులే టార్గెట్ గా దాడి చేసింది.

భారత నౌకాదళం తన పవర్ ను చూపించింది

నౌకాదళానికి చెందిన MiG-29K యుద్ధ విమానాలు, గగనతల హెచ్చరిక హెలికాప్టర్లు, కేరియర్ బ్యాటిల్ గ్రూప్ వంటి ఆధునిక సామగ్రి సముద్ర పరిధిలో నిరంతర గగనతల పర్యవేక్షణ చేపట్టి, పాకిస్తాన్ గగనతల విభాగాన్ని పడమర తీరంలో పూర్తిగా నియంత్రించాయి. ఈ చర్యలతో శత్రు దేశం తాత్కాలికంగా ఆపరేషన్ సామర్థ్యాన్ని కోల్పోయింది.

అలాగే, బ్రహ్మోస్ వంటి అత్యాధునిక క్షిపణులు, జలాంతర్గాముల నుండి ప్రయోగించగల క్రూజ్ మిస్సైళ్ల సామర్థ్యం భారత నౌకాదళాన్ని మరింత భద్రతగా, శక్తివంతంగా తీర్చిదిద్దాయి. శత్రుపక్షం నుండి వచ్చిన డ్రోన్ దాడులు, షెల్లింగ్ చర్యలను భారత వాయుసేన, వాయు రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి.

వ్యూహాత్మక మార్పుతో ఉగ్రదాడిని యుద్ధ చర్యగా తీసుకుని భారత్ దాడులు

భారత ప్రభుత్వం ఇప్పుడు ప్రతి ఉగ్రదాడిని ఒక యుద్ధ చర్యగా పరిగణించాలనే నూతన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇది నౌకాదళాన్ని మరింత అప్రమత్తంగా, విస్తృత రక్షణ వ్యూహాల్లో భాగంగా మలుస్తోంది. అందులో భాగంగానే ఆపరేష్ సింధూర్ ను చేపట్టింది. రాబోయే రోజుల్లో కూడా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ ఆపరేషన్ మొత్తం నాలుగు రోజుల పాటు కొనసాగింది. మే 10న పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారతదేశం చూపించిన బల ప్రదర్శన, వ్యూహాత్మక స్పష్టత, మౌలిక ఆధునికత పాకిస్తాన్‌ను వెనక్కి తగ్గేలా చేశాయి. 

మొత్తంగా అడ్మిరల్ త్రిపాఠి ప్రకారం.. "ఆపరేషన్ సింధూర్"లో నౌకాదళం ప్రదర్శించిన ధైర్యం, సమర్థత దేశ భద్రత పరిరక్షణలో ఎంత ముఖ్యమో చూపించింది. మారుతున్న భద్రతా పరిస్థితుల్లో భారత నౌకాదళం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. ఈ ఆపరేషన్ భారతదేశ శక్తి, సంకల్పాన్ని ప్రపంచానికి స్పష్టంగా చూపించిన ఉదాహరణగా నిలిచింది.