Earthquake: భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయిన మయన్మార్‌కు భారత్ సాయం చేస్తోంది. ఇప్పటికే 15 టన్నుల సరుకుతో భారత వైమానిక విమానం మయన్మార్ చేరుకుంది. ఇందులో ఏమేం వస్తువులు ఉన్నాయంటే...
Myanmar Earthquake : భూకంపం వల్ల పక్క దేశం మయన్మార్‌లో చాలా నష్టం జరిగింది. భారీగా ఆస్తినష్టమే కాదు ప్రాణనష్టం కూడా జరిగింది... శిథిలాలను తొలగిస్తున్నకొద్ది మృతదేహాలు బైటపడుతున్నాయి. ఇప్పటివరకు వెయ్యిమందికి పైగా చనిపోగా 2 మంది గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. తమ కళ్లముందే జరిగిన విధ్వంసాన్ని మయన్మార్ ప్రజలు మరిచిపోలేకపోతున్నారు... భయంతో చాలామంది నిన్నటినుండి రోడ్లపైనే ఉన్నారు.
ఇళ్లు కూలిపోయి చాలామంది సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డునపడ్డారు. తినడానికి తిండిలేక, కట్టుకోడానికి బట్టలు లేక ఇబ్బందిపడుతున్నారు. మయన్మార్ ప్రజల దయనీయ పరిస్థితి చూసి భారత ప్రధాని నరేంద్ర మోదీ చలించిపోయారు. మానవతాదృక్పథంతో వారికి సహాయం చేయడానికి ముందుకువచ్చారు.
కష్ట సమయంలో భారత్ మయన్మార్‌కు పెద్ద సాయం చేసింది. ఈ విపత్కర సమయంలో అక్కడి ప్రజలు ఇబ్బందిపడకుండా భారత్ 15 టన్నుల సరుకులు మయన్మార్‌కు పంపింది. ప్రత్యేక విమానంలో టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, దుప్పట్లు, రెడీమేడ్ భోజనం, నీళ్లు శుభ్రం చేసే మిషన్లు, పరిశుభ్రత కిట్లు, సోలార్ లాంప్స్, జనరేటర్ సెట్లు, పారాసిటమాల్, యాంటీబయాటిక్స్, సిరంజీలు, గ్లోవ్స్, బ్యాండేజీలు లాంటి ముఖ్యమైన మందులు పంపారు.
మయన్మార్ లోని భారతీయులంతా సురక్షితం
మయన్మార్‌లో పరిస్థితిని అక్కడి భారత రాయబార కార్యాలయం గమనిస్తోంది. ఈ భూకంపం వల్ల భారతీయులెవ్వరూ చనిపోయినట్టు లేదా గాయపడినట్టు తమకు సమాచారం లేదన్నారు. కాబట్టి ఎవరూ కంగారు పడవద్దని సూచించరాు.
ఇక థాయిలాండ్‌లోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. “బ్యాంకాక్, థాయిలాండ్‌లోని ఇతర ప్రాంతాల్లో వచ్చిన ప్రమాదకరమైన భూకంపం తర్వాత రాయబార కార్యాలయం థాయ్ అధికారులతో టచ్‌లో ఉంది. పరిస్థితిని గమనిస్తున్నారు. ఇప్పటివరకు ఏ భారతీయ పౌరుడికి సంబంధించి ఎలాంటి బ్యాడ్ న్యూస్ రాలేదు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే థాయిలాండ్‌లోని భారతీయ పౌరులు ఎమర్జెన్సీ నంబర్ +66 618819218కు కాల్ చేయమని సలహా ఇస్తున్నాము” అంటూ ఎక్స్ వేదికన ట్వీట్ చేసింది.
మయన్మార్ లో వరుస భూకంపాలు
శుక్రవారం నుంచి మయన్మార్‌లో కనీసం 14 సార్లు భూకంపం వచ్చింది. చాలా వరకు భూకంపాలు వెంటనే కొన్ని గంటల్లో వచ్చాయి. భూకంప శాస్త్రవేత్తల ప్రకారం వీటి తీవ్రత 3 నుంచి 5 మధ్యలో ఉంది. పెద్ద భూకంపం వచ్చిన 10 నిమిషాల తర్వాత 6.7 తీవ్రతతో పవర్ఫుల్ షాక్ వచ్చింది. పెద్ద భూకంపం రెక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో నమోదయింది.
ఈ భూకంపం కారణంగా కుప్పకూలిన భవనాలు, ఇళ్ల వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ యంత్రాల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. అలాగే వివిధ దేశాలు అందిస్తున్న నిత్యావసర వస్తులను అవసరమైనవారికి అందిస్తున్నారు.
