పీఓకే ఖాళీ చేస్తేనే కశ్మీర్ గురించి చర్చలు జరుపుతామని  విదేశాంగ మంత్రి జైశంకర్  కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. 

విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ అంశంపై భారత ప్రభుత్వ అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. న్యూఢిల్లీ లో హోండురాస్ రాయబార కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడిన జైశంకర్, కశ్మీర్ గురించి చర్చలేనిపని లేదని స్పష్టం చేశారు. చర్చలు ఉంటే ఒకటే అంశం — పీఓకే ఖాళీ చేయడంపై మాత్రమే అని చెప్పారు.

భారత భూభాగాన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుని ఉండటమే అసలు సమస్య అని, అందుకే చర్చల్లో అది తప్ప మరోదేమీ చర్చనీయాంశంగా ఉండదని జైశంకర్ స్పష్టీకరించారు. భారత్-పాక్ చర్చలు ఎప్పుడూ ద్వైపాక్షికంగానే జరగాలని, మూడోవారి జోక్యం అస్సలు అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు.

పాక్‌తో చర్చలకు సంబంధించి మరో కీలక విషయాన్ని వెల్లడించిన జైశంకర్, చర్చలు జరగాలంటే అది ఉగ్రవాదంపై మాత్రమేనని చెప్పారు. పాకిస్తాన్ వద్ద ఉగ్రవాదుల జాబితా ఉందని, దాన్ని భారత్‌కు ఇచ్చి ఆ స్థాయిలో సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా తొలగించడంపైనే భారత్ దృష్టి పెట్టిందని వివరించారు.

ఇక పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా భారత్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటి — సింధు జల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడమని చెప్పారు. ఉగ్రవాదంపై కఠినమైన సంకేతాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వివరించారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర భద్రతా వ్యవహారాల కమిటీ ఆమోదించిందని, ప్రభుత్వం సంపూర్ణ మద్దతుతో ముందుకెళ్లిందని అన్నారు.

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, భారత్ మే 6, 7 తేదీల్లో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ సహా పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై “ఆపరేషన్ సింధూర్” పేరిట గట్టి దాడులు జరిపింది. ఈ దాడులకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఆధారంగా తీసుకున్నట్టు వివరించారు.

ఈ దాడుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారత్‌కు మద్దతుగా నిలవడం గమనార్హం. ముఖ్యంగా హోండురాస్ ప్రభుత్వం పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించినందుకు జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ భద్రతకు మద్దతుగా వారి సహకారాన్ని ప్రశంసించారు.

మే 13న విదేశాంగ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ కూడా సింధు జల ఒప్పందం నిలిపివేతను ఉగ్రవాదంపై భారత నిర్ణయం ఎంతో గట్టి సంకేతంగా పేర్కొన్నారు. ఒప్పందం ఉద్దేశం శాంతి, సహకారం అయినా, పాక్ కొనసాగిస్తున్న ఉగ్రవాద విధానం దాన్ని దిగజార్చిందన్నారు. వాతావరణ మార్పులు, జనాభా పెరుగుదల, సాంకేతిక అభివృద్ధి వంటి అంశాలు కూడా ఈ నిర్ణయానికి నేపథ్యంగా ఉన్నాయని వివరించారు.