RCB vs KKR: వర్షం భయం.. మ్యాచ్ రద్దైతే RCB-KKR ప్లేఆఫ్ పరిస్థితి ఏంటి?
IPL 2025 RCB vs KKR: మే 17 నుండి పునఃప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 టోర్నీకి వర్షం ముప్పు పొంచి ఉంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం బెంగళూరులో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆర్సీబీ-కేకేఆర్ మధ్య జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే జట్ల ప్లేఆఫ్ కథ ఏమిటి?

IPL 2025 RCB vs KKR: ఐపీఎల్ 2025 టోర్నీ మే 17 నుండి పునఃప్రారంభం అవుతోంది. పునఃప్రారంభంలో మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. అయితే, మే 17న బెంగళూరులో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఆర్సీబీ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే రెండు జట్లు ఒక్కో పాయింట్ పంచుకుంటాయి. దీంతో ఆర్సీబీ 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలుస్తుంది.
ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో గెలిచినా లేదా వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. కానీ, కేకేఆర్ జట్టు పరిస్థితి దయనీయంగా ఉంటుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసు నుండి బయటపడుతుంది. ఐపీఎల్ 2025 టోర్నీ నుండి నిష్క్రమించిన నాల్గవ జట్టుగా నిలుస్తుంది.
మే 14న ఆర్సీబీ ఆటగాళ్లు బెంగళూరుకు చేరుకున్నారు. మంగళవారం బెంగళూరులో భారీ వర్షం కురిసింది. ఆటగాళ్లు వస్తుండగానే వర్షం ఘనస్వాగతం పలికింది. మే 17న జరిగే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
మే 17 సాయంత్రం బెంగళూరులో వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. మ్యాచ్ రోజున 75% వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఘర్షణల కారణంగా ఐపీఎల్ టోర్నీ వాయిదా పడింది. భద్రతా కారణాల దృష్ట్యా టోర్నీని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో మే 17 నుండి ఐపీఎల్ పునఃప్రారంభం అవుతోంది.
ఐపీఎల్ షెడ్యూల్ మార్పు, ఇతర కారణాల వల్ల చాలా మంది విదేశీ ఆటగాళ్లు టోర్నీకి అందుబాటులో లేరు. దీంతో బీసీసీఐ ప్లేయర్ రీప్లేస్‌మెంట్ నిబంధనల్లో మార్పులు చేసింది. ఫ్రాంచైజీలు అందుబాటులో లేని ఆటగాళ్ల స్థానంలో ఇతర ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం కల్పించింది.