అండమాన్ నికోబార్ దీవులు భారతదేశ ఆర్థిక వ్యవస్థనే మార్చే స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చే అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఆ స్థాయిలో అండమాన్ లో ఏముందో తెలుసా?
Oil Reserves in Andaman : భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది. ఇటీవలే జపాన్ ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అయితే ఇంతటితో సరిపెట్టుకోవాలని భావించడంలేదు... మరింత ముందుకు దూసుకెళ్లి అమెరికా, చైనా ఆర్థిక వ్యవస్థలను అధిగమించాలని చూస్తోంది భారత్. ఈ దిశగా మోదీ సర్కార్ చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆసక్తికర ప్రకటన చేసారు. ఆయన చెప్పిందే నిజమైతే భారత ఆర్థిక వ్యవస్థ మరో శిఖరానికి చేరుకుంటుంది. ఎవరూ ఊహించని స్థాయికి భారత్ వెళుతుంది. ఇంతకూ కేంద్ర మంత్రి ఏం ప్రకటించారు... ఇది ఆర్థిక వ్యవస్థను ఏ స్థాయికి తీసుకెళుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంలో భారీగా ముడిచమురు నిల్వలు
ప్రపంచంలో చమురు ఉత్పత్తి అనగానే అరబ్ దేశాలు గుర్తుకువస్తాయి. ఇక యూఎస్, చైనా వంటి దేశాలు చమురు కూడా ఉత్పత్తితో పాటు వినియోగంలోనూ ముందున్నాయి. కానీ భారత్ విషయానికి వస్తే క్రూడాయిల్ ఉత్పత్తిలో దిగువన ఉంది... కానీ వినియోగంలో మాత్రం టాప్ లో ఉంది. దీంతో క్రూడాయిల్ ను భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం భారీగా ఖర్చుచేయాల్సి రావడం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
అమెరికా, చైనా తర్వాత ముడిచమురును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం భారత్. దేశ అవసరాల కోసం ఉపయోగించే క్రూడాయిల్ లో 85-88 శాతం దిగుమతి చేసుకుంటున్నదే... కేవలం 10-15 శాతమే దేశంలో ఉత్పత్తి అవుతోంది. అయితే తాజాగా భారతదేశ ఆర్ధిక వ్యవస్థనే పూర్తిగా మార్చివేసే స్థాయిలో ముడిచమురు నిల్వలు లభించాయని... ఇది గేమ్ చేంజర్ కానుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆసక్తికర ప్రకటన చేసారు.
అండమాన్ సముద్రంలో భారీగా ఆయిల్ నిల్వలు కనుగొన్నట్లు మంత్రి తెలిపారు. గయానా చమురు నిల్వల స్థాయిలో అండమాన్ లో చమురు నిల్వలు ఉన్నాయని ఆయన తెలిపారు. గయానాలో 11.6 బిలియన్ బ్యారల్స్ చమురు నిల్వలు ఉన్నాయి.. ఇదే స్థాయిలో అండమాన్ లో కూడా 1,160 కోట్ల బ్యారల్స్ ముడిచమురు అంటే 1,84,440 కోట్ల లీటర్ల క్రూడాయిల్ ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
అండమాన్ ఆయిల్ నిల్వలతో మారనున్న భారత ఆర్థిక వ్యవస్థ
ప్రస్తుతం భారతదేశం ప్రపంచలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నాలుగో స్థానంలో ఉంది. మన దేశ జిడిపి 4.19 ట్రిలియన్ డాలర్లు. అగ్రస్థానంలో ఉన్న అమెరికా జిడిపి 30 ట్రిలియన్ డాలర్లు కాగా రెండోస్థానంలోని చైనా 19 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కలిగివుంది.
అయితే అండమాన్ లో కనుగొన్న ఆయిల్ నిల్వలు అందుబాటులోకి వస్తే భారత ఆర్థిక వ్యవస్థ చైనాను దాటి రెండో స్థానానికి చేరుకుంటుందని కేంద్ర మంత్రి మంత్రి తెలిపారు. అంటే ఇప్పుడు 4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ అమాంతం 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అన్నారు.
ఇప్పటికే ప్రభుత్వరంగ సంస్థలు ఆయిల్ ఇండియా, ఓఎన్జీసి సంస్థల అండమాన్ సముద్రంలో ఆయిల్ నిల్వల కోసం తవ్వకాలు జరుపుతోందని మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అయితే ఇక్కడ చమురును వెలికితీయడం చాలా ఖర్చుతో కూడిన పనిగా ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఒక్క బావి తవ్వడానికి దాదాపు 10 కోట్ల డాలర్లు అంటూ రూ.850 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు.
కేజి బేసిన్ లో చమురు నిల్వలు
భారతదేశంలో ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని కేజి బేసిన్ (Krishna Godavari) లో భారీగా చమురు, సహజ వాయువు నిల్వలు ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదులు బంగాళాఖాతంలో కలిసే ప్రాంతంలోని పెద్ద డెల్టా మైదానమే కేజి బేసిన్. ఇక్కడ ప్రభుత్వరంగ ఆయిల్ కంపనీ ఓఎన్జీసితో పాటు ప్రైవేట్ కంపనీలు క్రూడాయిల్, సహజ వాయువులు వెలికితీస్తున్నాయి.
అయితే ఇంతకంటే భారీస్థాయిలో అండమాన్ లో చమురు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. గయానాలో ఇటీవలకాలంలో భారీగా క్రూడాయిల్ నిక్షేపాలు బయటపడ్డాయి.. దీంతో ఆ ప్రాంతం పరిస్థితే మారిపోయింది. ప్రస్తుతం ప్రపంచంలోనే సరికొత్త పెట్రోలియం ఉత్పత్తిదారుగా గయానా నిలిచింది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద తలసరి పెట్రోలియం ఉత్తత్తి దేశంగా... 17వ అతిపెద్ద చమురు నిక్షేపాలు కలిగిన దేశంగా గయానా ,నిలిచింది. ఈ స్ధాయిలో అండమాన్ లో చమురు నిక్షేపాలు ఉంటే భారత్ జాక్ ఫాట్ కొట్టినట్లే.
