గతంలో చైనా దురాక్రమణపై చర్చించేందుకు దివంగత ప్రధాని వాజ్ పేయి మొదటి సారిగా ఎంపీగా ఉన్నప్పుడు జవహార్ లాల్ నెహ్రూకు లేఖ రాశారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ గుర్తు చేసుకున్నారు. దానిని నెహ్రూ అంగీకరించి పార్లమెంట్ ను సమావేశపరిచారని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని బీజేపీని విమర్శించారు.
దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎన్డీయేపై విమర్శలు గుప్పించారు. ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ లో నెలకొన్న గందరగోళాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు.
మధ్య ప్రదేశ్ లో ఘోరం... ప్రియురాలిని క్రూరంగా చితకబాదిన దుర్మార్గుడు
‘‘ నేడు అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి. ఆయన మొదటి సారిగా ఎంపీగా ఉన్న ఓ సమయంలో చైనా దురాక్రమణపై చర్చించడానికి పార్లమెంటును ముందుగా సమావేశపరచాలని కోరుతూ నెహ్రూకు లేఖ రాశారు. దానికి నెహ్రూ అంగీకరించారు. కానీ ఇప్పుడు చైనా చొరబాట్ల గురించి కూడా చర్చించేందుకు అవకాశం లేదు ’’అని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. 1962లో జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో భారత్-చైనా ఉద్రిక్తతలపై వాజ్ పేయి కోరిక మేరకు పార్లమెంట్ లో చర్చ జరిగిందని ఆయన గుర్తు చేసుకున్నారు. కాగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ లు వాజ్ పేయికి ఘన నివాళులు అర్పించిన కొద్ది గంటల్లోనే జై రాం రమేష్ ఈ ట్వీట్ చేశారు.
అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ పరిధలో ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి డిసెంబర్ 9న ఇరు దేశాల దళాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ వివరాలు బయటకు వచ్చిననాటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికార ఎన్డీఏ కూటమిపై దాడి చేస్తోంది. ఈ ఘటనలో భారత సైనికులు ఎవరూ చనిపోలేదని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ లో ప్రకటించారు. కానీ కాంగ్రెస్ పార్టీ పదే పదే ఈ విషయంలో చర్చకు డిమాండ్ చేయడంతో ఇటు లోక్ సభలో, అటు రాజసభలో సమావేశాలకు అంతరాయం ఏర్పడింది.
అయితే ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ నిధులకు సంబంధించిన వ్యత్యాసాలపై దృష్టి మరల్చడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భారతదేశానికి చెందిన ఒక్క అంగులం భూమిని కూడా ఎవరూ తీసుకోలేరని అన్నారు.
కాగా.. ఇదే అంశంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బీజేపీపై విమర్శలు చేశారు. గత గురువారం పార్లమెంట్ లోని సెంట్రల్ హాల్‌లో పార్టీ ఎంపీలతో ఆమె మాట్లాడారు. భద్రతా సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమయ్యిందని, ఇది ఆందోళకరమని అన్నారు. “మన సరిహద్దులోకి చైనా చొరబాట్లు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో ఈ దాడులను అప్రమత్తంగా తిప్పికొట్టిన మన సైనికులకు దేశం మొత్తం అండగా నిలుస్తోంది. అయితే ప్రభుత్వం మొండిగా పార్లమెంటులో ఈ అంశంపై చర్చకు అనుమతిని నిరాకరిస్తోంది.” అని సోనియా గాంధీ అన్నారు. “మనపై నిరంతరం దాడి చేయడానికి చైనా ఎందుకు ధైర్యం చూపిస్తోంది.? ఈ దాడులను తిప్పికొట్టేందుకు ఎలాంటి సన్నాహాలు చేశారు. ఇంకా ఏమి చేయాలి? భవిష్యత్ చొరబాట్ల నుండి చైనాను నిరోధించడానికి ప్రభుత్వ విధానం ఏమిటి? ’’ అని అన్నారు.
చర్చలను అడ్డుకుంటూనే, ప్రతిపక్షాలను, ప్రశ్నించే గొంతులను లక్ష్యంగా చేసుకోవడంలో, మీడియాను తారుమారు చేయడంలో, తనకు అడ్డుగా ఉన్న సంస్థలను నిర్వీర్యపర్చడంలో బీజేపీ చురుకుగా నిమగ్నమై ఉందని అన్నారు. మన దేశం నుంచి చైనాకు ఎగుమతుల కంటే, ఆ దేశం నుంచి దిగుమతులే ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు.
