Asianet News TeluguAsianet News Telugu

ఆడబిడ్డలను తాగుబోతులకిచ్చి పెళ్లి చేయకండి.. నా కొడుకును లిక్కర్ వ్యసనం నుంచి కాపాడలేకపోయా..: కేంద్రమంత్రి

కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ ఓ డీ అడిక్షన్ కార్యక్రమంలో మాట్లాడుతూ మద్యానికి బానిసైన వారికి ఆడబిడ్డలను ఇచ్చి పెళ్లి చేయవద్దని కోరారు. వారి జీవితం కాలం చాలా స్వల్పం అని వివరించారు. ఈ సందర్భంగా అతను తన కొడుకు లిక్కర్ వ్యవసనానికి లోనై మరణించిన విషయాన్ని ప్రస్తావించారు.
 

union minister says dont spoil our daughters life by marriyng off them to alcoholics
Author
First Published Dec 25, 2022, 2:06 PM IST

న్యూఢిల్లీ: ‘రిక్షా లాగేవాడికి లేదా దినసరి కూలీకి అయినా సరే ఆడబిడ్డను ఇచ్చి పెళ్లి చేయవచ్చు.. కానీ, లిక్కర్‌కు వ్యసనమైనవాడికిచ్చి పెళ్లి చేయకూడదు. మందుకు బానిసైనవాళ్ల కంటే వారు చాలా బెటర్. తాగుబోతుల జీవిత కాలం తక్కువ. వారికి ఆడబిడ్డలను ఇచ్చి గొంతుకోయవద్దు’ అని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కౌశల్ కిషోర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత అనుభవాన్ని ప్రస్తావించారు. తన కొడుకును మందు వ్యసనం నుంచి కాపాడుకోలేకపోయానని వివరించారు. ఉత్తరప్రదేశ్ సుల్తాన్‌పూర్ జిల్లా లంభువా అసెంబ్లీ  నియోజకవర్గంలో నిర్వహించిన ఓ డీ అడిక్షన్ కార్యక్రమంలో శనివారం మాట్లాడారు.

‘నేను ఎంపీగా, నా భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా మా కొడుకును కాపాడుకోలేకపోయాం. అలాంటప్పుడు సాధారణ ప్రజలు మాత్రం ఈ లిక్కర్ అడిక్షన్ నుంచి ఎలా తమ ఆప్తులను కాపాడుకోగలరు. నా కొడుకు (ఆకాశ్ కిశోర్) వాడి ఫ్రెండ్స్‌తో మందు తాగడం అలవాటు చేసుకున్నాడు. వాడిని ఓ డీ అడిక్షన్ సెంటర్‌లోనూ చేర్పించాం. ఈ దురలవాటును మా కొడుకు ఇక మానుకుంటాడని మేమంతా అనుకున్నాం. ఆరు నెలల తర్వాత పెళ్లి ఫిక్స్ చేశాం. కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత మళ్లీ మా కొడుకు తాగడం మొదలు పెట్టాడు. ఆ వ్యసనమే చివరికి ప్రాణాలు తీసింది. రెండేళ్ల క్రితమే అక్టోబర్ 19న ఆకాశ్ మరణించాడు. అప్పుడు ఆకాశ్ కొడుక్కి రెండేళ్లు మాత్రమే’ అని కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ వివరించారు.

Also Read: మద్యపానంపై నిషేధమున్న బిహార్‌లో పోలీసు స్టేషన్‌లో లిక్కర్ పార్టీ.. ఖైదీలు, అధికారులు కలిసే..!

ఆ కార్యక్రమానికి హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘నేను నా కొడుకును కాపాడలేకపోయా. అందుకే ఇప్పుడు నా కోడలు విధవగా మిగిలింది. మీరంతా మీ కూతురు, అక్కా చెల్లెళ్లను దీని నుంచి కాపాడుకోండి’ అని అన్నారు. ‘స్వాతంత్ర్య పోరాటంలో 90 ఏళ్ల కాలంలో 6.32 లక్షల మంది ప్రాణ త్యాగం చేశారు. కానీ, మద్యం  వ్యసనం కారణంగా ప్రతి ఏడాది సుమారు 20 లక్షల మంది మరణిస్తున్నారు’ అని కేంద్ర మంత్రి తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లోని మోహన్‌లాల్ గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన కౌశల్ కిషోర్ తంబాకు, సిగరెట్లు, బీడీల వ్యవసనం గురించీ మాట్లాడారు. క్యాన్సర్ మరణాల్లో 80 శాతం కేవలం వీటి వ్యసనం వల్లే మరణిస్తున్నారని వివరించారు. కాబట్టి, మీరంతా, ఇతర సంస్థలూ కలిసి డీ అడిక్షన్ ప్రోగ్రామ్‌లో పాలుపంచుకుని కుటుంబాలను నిలబెట్టాలని కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios