భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరుదేశాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా త్రివిద దళాధిపతులతో భేటీ అవుతున్నారు.
Narendra Modi : పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఇరుదేశాల వ్యవహారతీరు యుద్దం తప్పదేమో అన్న అనుమానాలకు తావిస్తోంది. తాజాగా పాక్ క్షిపణి పరీక్షలు జరుపుతుంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా త్రివిధ దళాధిపతులతో సమావేశం అవుతున్నారు. నిన్న(శనివారం) నేవీ చీఫ్ మార్షల్ దినేష్ కె. త్రిపాఠి తో సమావేశమైన ప్రధాని నేడు(ఆదివారం) ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ భేటీ అయ్యారు. భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ త్రివిధ దళాలతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశం తర్వాత వాయుసేన అధిపతి, ప్రధాని మోదీల భేటీ జరిగింది. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ముగ్గురు సైనిక దళాల అధిపతులు పాల్గొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పాకిస్థాన్ కు షాక్ ల మీద షాక్ ఇస్తున్న భారత్ :
పహల్గాంలో అమాయక పర్యాటకుల మరణానికి పాకిస్థాన్ ప్రధాన కారణమని భారత్ బలంగా నమ్ముతోంది. పాక్ సాయంతోనే ఉగ్రవాదులు కశ్మీర్ లోకి అక్రమంగా చొరబడి అమాయకుల ప్రాణాలు తీసారన్నది ఎవరూ కాదనలేని నిజం. ఇంతకాలం పాక్ ఉగ్రవాద చర్యలను చూసిచూడనట్లు వదిలేసిన భారత్ ఇకపై ఉపేక్షించే ప్రసక్తేలేదంటోంది. ఇప్పటికే పాకిస్థాన్ తో గతంలో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుని షాక్ ఇచ్చింది. పాక్ కు జీవనాధారరమైన సింధుజలాలను భారత్ అడ్డుకోవడం పాక్ కు తీవ్ర నష్టాన్ని మిగిలిస్తుంది.
ఇక ఇటీవల మరో నిర్ణయం తీసుకుంది భారత్. ముందుగా భారత విమానాలను పాక్ గగనతలంలో రాకుండా నిషేధం విధించారు... సేమ్ నిర్ణయాన్ని భారత్ కూడా తీసుకుంది. పాక్ విమానాలు భారత గగనతలంలోకి రాకుండా నిషేధం విధించింది.
తాజాగా పాకిస్థాన్ నుండి వచ్చే అన్నిరకాల దిగుమతులను భారత్ నిషేధించింది. పాక్ తో ఇప్పటికే ప్రత్యక్షంగా వాణిజ్య సంబంధాలు లేవు కానీ పరోక్షంగా ఆ దేశానికి చెందిన కొన్ని వస్తువులు భారత్ కు వస్తుంటాయి. ఇలా ఇకపై పాకిస్థాన్ కు చెందిన ఏ వస్తువులు భారత్ కు చేరకుండా పూర్తిగా నిషేధం విధించారు. ఆ దేశం నుండి పార్శిళ్లు, కొరియర్లపై కూడా నిషేధం విధించారు. ఇదికూడా పాక్ కు పెద్ద ఎదురుదెబ్బే. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన భారత్ నిషేధం విధించడంతో పాక్ వస్తువులకు గిరాకీ వుండదు. తద్వారా ఆర్ధిక వ్యవస్థ నష్టం వాటిల్లుతుంది.
ఇలా ఓవైపు పాకిస్థాన్ ను పరోక్షంగా దెబ్బతీసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. మరోవైపు త్రివిద ధళాధిపతులతో నిత్యం ప్రధాని మోదీ టచ్ లో ఉంటున్నారు... వారితో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో భారత్ తమపై సైనిక చర్యలకు దిగుతుందన్న భయం పాక్ కు పట్టుకుంది.