భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా పాకిస్థాన్ ఓ క్షిపణి పరీక్ష జరిపినట్లు తెలుస్తోంది. ఇలా ప్రయోగించిన అబ్దాలీ క్షిపణి ప్రత్యేకతలేంటంటే...
India Pakistan : పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా ఇరుదేశాల మధ్య దాడులు మొదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా భారత్ ఎప్పుడు ఎలా దాడి చేస్తుందోనన్న భయం పాక్ కు పట్టుకుంది. అందుకే ఆ దేశం తమ ఆయుధాలను సంసిద్దం చేసుకుంటున్నాయి. తాజాాగా ఈ దేశం క్షిపణి పరీక్ష చేసినట్లు తెలుస్తోంది. .
పాకిస్తాన్ అబ్దాలి క్షిపణి పరీక్ష
పాకిస్థాన్ తన ఆయుధ సంపత్తిని పరీక్షించే పనిలో పడింది. ఇందులో భాగంగానే మే 3, 2025న అంటే నిన్న శనివారం ఆదేశం అబ్దాలి క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించింది. ఈ క్షిపణి 450 కి.మీ. దూరం ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించగలదని పాక్ చెబుతోంది.
ఈ క్షిపణి పరీక్ష సైన్యం యొక్క సన్నద్ధతను, సాంకేతిక సామర్థ్యాన్ని పరీక్షించడానికి నిర్వహించినట్లు పాకిస్తాన్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఏ రకమైన శిక్షణ అనే దానిపై ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. ఈ పరీక్షను పాకిస్తాన్ సైనిక సలహా బృందం కమాండర్, పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైనిక ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు.
అరేబియా సముద్రంలో పాకిస్తాన్ నౌకాదళం మొహరింపు
భారత్ ఎప్పుడు ఎక్కడినుండి దాడికి దిగుతుందోనని భయపడిపోతున్న పాకిస్తాన్ అరేబియా సముద్రంలో నౌకాదళాలను మొహరించింది. అలాగే నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనలను పెంచింది. పాకిస్తాన్ వైమానిక దళం ఒకేసారి మూడు యుద్దవిమానాలతో విన్యాసాలు నిర్వహిస్తోంది. వీటిలో F-16, J-10, JF-17 వంటి అన్ని ప్రధాన యుద్ధ విమానాలు ఉన్నాయి. సరిహద్దుల్లో వైమానిక రక్షణ, ఫిరంగులను మోహరించింది. రాజస్థాన్‌లోని బార్మెర్‌లోని లాంగేవాలా సెక్టార్ సమీపంలో అధునాతన రాడార్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది.
భారత సైన్యానికి ప్రధాని మోదీ అధికారం
మరోవైపు భారత సైన్యానికి పూర్తి అధికారాలను ప్రధాని మోదీ అప్పగించడంతో పాకిస్తాన్‌లో ఆందోళన నెలకొంది. భారత సైన్యం ఎప్పుడైనా దాడి చేయవచ్చనే భయంతో ఉంది. భారత్ కూడా రాఫెల్ యుద్ధ విమానాలతో విన్యాసాలను నిర్వహిస్తోంది.


