రాజా రఘువంశీ హత్యకేసులో సోనమ్‌ వినియోగించిన యూపీఐ ఖాతా జితేంద్ర రఘువంశీ అనే పేరు మీద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అసలీ జితేంద్ర ఎవరూ..అతనికి ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ హత్య కేసులో (Honeymoon murder case) దర్యాప్తు మరింత వేగంగా సాగుతోంది. రాజా రఘువంశీ మృతిపై జరుగుతున్న ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. తాజా సమాచారం ప్రకారం, ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీ ఒక యూపీఐ ఖాతాను వాడినట్టు పోలీసులు గుర్తించారు. ఆ ఖాతా జితేంద్ర రఘువంశీ అనే వ్యక్తి పేరిట ఉండటంతో పోలీసుల దృష్టి ఇప్పుడు ఆ వ్యక్తిపై నిలిచింది.

జితేంద్ర ఎవరు..

సోనమ్ తన భర్తను హత్య చేయించేందుకు కిరాయి హంతకులకు డబ్బు చెల్లించిందని పోలీసులు ఇప్పటికే తేల్చిచెప్పారు. మే 23న జరిగిన ఆ లావాదేవీల్లో జితేంద్ర పేరున ఉన్న బ్యాంకు ఖాతా నుంచే డబ్బు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో జితేంద్ర ఎవరు, అతని పాత్ర ఏంటి అనే దానిపై విచారణ మొదలైంది. హవాలా మార్గం ద్వారా ఈ చెల్లింపులు జరిగి ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు ఆమె కుటుంబానికి చెందిన వ్యాపారాలపై దృష్టి సారించారు.

ఆమెనే హత్య చేసింది..

ఇక, ఈ ఆరోపణలపై సోనమ్ సోదరుడు గోవింద్ స్పందించారు. జితేంద్ర తనకు బంధువేనని, తమ వ్యాపారాల్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి మాత్రమేనని తెలిపారు. రోజూ జరిగే లావాదేవీల కోసం జితేంద్ర ఖాతాను వాడతామనీ, సోనమ్ యూపీఐ కూడా అదే పేరుతో తీసుకుందని వివరించారు. అయితే ఇలా ఎందుకు చేశారన్న దానికి మాత్రం గోవింద్ స్పష్టత ఇవ్వలేదు.

ఆమె దుర్మార్గానికి నేనే సాక్షి..

ఇక మరోవైపు గోవింద్ తాజాగా రాజా కుటుంబాన్ని కలుసుకుని పరామర్శించారు. చెల్లెలు చేసిన దుర్మార్గానికి తానే సాక్షినంటూ గోవింద్ ఓపెన్‌గా చెప్పారు. గాజీపుర్‌లో సోనమ్‌ను కలిసిన తర్వాత ఆమె మాటలు, ప్రవర్తన చూస్తే నిజం బయటపడినట్టేనని తెలిపారు. ఆమెపై దృష్టి మరల్చేందుకు వాదనలు వినిపిస్తున్నా, నిజం బయటకు రావాలనే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది. నిజం నిగ్గు తేలితే కనుక సోనమ్ ని ఉరి తీయాలని ఆమె సోదరుడు అన్నాడు.