మేఘాలయలో మిస్సింగ్ అయిన జంట కేసులో భర్త హత్యకు భార్యే సుపారీ ఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.ఇప్పటి వరకు ఈ కేసులో నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.
మేఘాలయలో అదృశ్యమైన ఇండోర్ జంట కేసు తెరపైకి కొత్త నిజాలు తీసుకొచ్చింది. మే 11న వివాహం చేసుకున్న రాజా రఘువంశీ, సోనమ్ అనే దంపతులు మే 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. మే 22న వారు మౌలాకియాత్ గ్రామానికి బైక్‌పై వెళ్లినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అక్కడ బైక్‌ను పార్క్ చేసి ప్రసిద్ధ లివింగ్ రూట్ వంతెన చూడటానికి వెళ్లిన తరువాత నుంచి వారు కన్పించలేదు.
అదృశ్యమైన 11 రోజుల తరువాత, జూన్ మొదటివారంలో రఘువంశీ మృతదేహం సోహ్రా వద్ద ఓ లోతైన లోయలో లభ్యమైంది. అతడి శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో ఇది హత్య కేసుగా పోలీసులు భావించారు. అదే సమయంలో అతడి భార్య సోనమ్ కనిపించకపోవడం అనుమానాలకు దారి తీసింది.
దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు, సోనమ్ ఉత్తరప్రదేశ్‌లోని గాజీపుర్‌లో లొంగిపోవడంతో ఆమెను అరెస్టు చేశారు. ఆమె విచారణలో రఘువంశీని హత్య చేయించేందుకు తానే సుపారీ ఇచ్చినట్టు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. రాజ్ కుశ్వాహ అనే వ్యక్తితో తనకు సంబంధం ఉండడం వల్లే ఈ హత్య చేయించినట్లు తెలిసింది.ఆమెతో పాటు హత్యలో పాలుపంచుకున్న మరో ముగ్గురిని కూడా అరెస్టు చేశారు.
కాంట్రాక్ట్ కిల్లర్లను..
పోలీసుల ప్రాథమికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం, సోనమ్ తన భర్తను చంపించేందుకు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించింది. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా ఇతర వ్యక్తులు కూడా ప్రమేయం ఉన్నట్టు అనుమానించడంతో దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కేసుపై స్పందించిన మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, పోలీస్ శాఖను ప్రశంసించారు. త్వరితగతిన కేసును ఛేదించినందుకు పోలీసులను అభినందించారు. కేసులో ఇంకా నిందితులు ఉండొచ్చని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని చెప్పారు.
మా కూతురికి ఏం పాపం తెలియదు..
ఈ కేసులో భర్త రాజా రఘువంశీ హత్యకు భార్య సోనమ్‌నే సుపారీ ఇచ్చినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. తాజాగా సోనమ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని గాజీపుర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై సోనమ్ తండ్రి దేవీ సింగ్ స్పందిస్తూ, తన కుమార్తె అమాయకురాలని అన్నారు. గాజీపుర్‌లోని హోటల్ వద్ద తను ఏడుస్తూ కనిపించిందని, అక్కడినుంచి తన లొకేషన్‌ను పంపి పోలీసులను సంప్రదించిందని తెలిపారు. మేఘాలయ పోలీసులు చెప్పే వాదనను త్రోసిపుచ్చారు. ఈ కేసును సీబీఐతో విచారణ చేయాలని కోరారు.
రఘువంశీ కుటుంబం ఇందౌర్‌లో ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం నిర్వహిస్తోంది. మే 11న రాజా–సోనమ్ వివాహం జరిగిందని, హనీమూన్ కోసం మే 20న మేఘాలయ వెళ్లినట్లు తెలిసింది. మే 22న ద్విచక్ర వాహనంతో మౌలాకియాత్ గ్రామానికి వెళ్లిన తర్వాత వారు కనిపించకుండా పోయారు. 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహం బయటపడింది.
సోనమ్ పోలీసుల ఎదుట లొంగిన తర్వాత, ఈ కేసులో ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు సోనమ్‌నే హత్యకు సుపారీ ఇచ్చిందని తెలిపారు. ఆమెకు రాజ్ కుశ్వాహా అనే వ్యక్తితో సంబంధం ఉందని మీడియా నివేదికలు వెల్లడించాయి.
ఆమె చెప్పిన తరువాతే…మాకు తెలిసింది
రఘువంశీ సోదరుడు విపిన్ మాట్లాడుతూ, సోనమ్ చేసిన కాల్‌తోనే పోలీసులు ఆమెను పట్టుకున్నారని చెప్పారు. ఆమె చాలా భయాందోళనలో ఉందని, ఆమె నుంచి విన్న విషయాలపైనే తమ విశ్వాసం ఉందన్నారు.
