దేశంలో కరోనా వైరస్ మొదలైన నాటి నుంచి ప్రతిరోజూ సాయంత్రం 4 - 5 గంటల మధ్యలో కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియా ముందుకు వచ్చేవారు.

దేశంలో కేసుల పరిస్ధితి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆయన వివరించేవారు. అయితే గత కొన్ని రోజుల నుంచి మాత్రం లవ్ అగర్వాల్‌ కానీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ ప్రెస్ మీట్‌లో కనిపించడం లేదు.

Also Read:కరోనా వైరస్: భారత్‌కు బిగ్ రిలీఫ్.... మన దగ్గర మరణాల 0.2 శాతమే

గత ఎనిమిది రోజులుగా క్షేత్రస్థాయిలో మహమ్మారి పరిస్ధితి, దీనిని ఎదుర్కొనే విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలపై ఆ శాఖ మీడియా ముందుకు రావడం లేదు. కోవిడ్ కేసులు లక్షదాటడంతో వైరస్ ప్రభావిత టాప్ 10 దేశాల్లో భారత్ చేరడం దేశ పౌరులను కలవరానికి గురిచేస్తోంది.

వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు తక్కువగా ఉన్నా కేసుల సంఖ్య మాత్రం అనూహ్యంగా పెరిగిపోయింది. కరోనా హాట్ స్పాట్‌గా భారతదేశం మారుతుండటం కలవరపాటుకు గురిచేస్తోన్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ వైఖరిపై పలువురు విమర్శలు చేస్తున్నారు.

Also Read:భారత్ లో కరోనా కేసులు.. గత 24గంటల్లో ఎన్ని పెరిగాయంటే..

మే 7 నుంచి దేశంలో ప్రతిరోజూ 3,200 కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత నాలుగు రోజులుగా కరోనా కేసులు రోజుకు 4,950కి పైగా వెలుగు చూస్తున్నాయి. గత రెండు నెలలుగా ఎప్పుడూ లేని విధంగా బుధవారం ఒక్క రోజే ఏకంగా 5,611 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో కరోనా కేసులు, మరణాల సంఖ్య వంటి అన్ని వివరాలను ప్రతిరోజూ ఉదయం అప్‌డేట్ చేస్తున్నారు. కానీ మీడియాతో నేరుగా మాట్లాడి సందేహాలను నివృత్తి చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.