ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం భారతదేశంపై అంతగా పడలేదు. ముందుగా మేల్కొని తీసుకున్న లాక్‌డౌన్‌ నిర్ణయంతో  పాటు మన భౌగోళిక, వాతావరణ పరిస్ధితులు ఇతరత్రా కారణాల కారణంగా భారతీయులు కోవిడ్ 19ను తట్టుకోగలుగుతున్నారు.

ఈ క్రమంలో మనదేశంలో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రపంచంలోని మొత్తం జనాభాను పరిగణనలోనికి తీసుకుంటే లక్ష జనాభాకు 62 మంది కోవిడ్ బారినపడ్డారని.. కానీ భారతదేశంలో మాత్రం లక్ష జనాభాకు 7.9 శాతం మంది మాత్రమే వైరస్‌కు చిక్కారని లవ్ అగర్వాల్ వెల్లడించారు.

Also Read:భారత్ లో కరోనా కేసులు.. గత 24గంటల్లో ఎన్ని పెరిగాయంటే..

ఇక కరోనా మరణాల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు 4.2 శాతం మంది మరణించగా, భారత్‌లో 0.2 శాతం మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారని ఆయన ప్రకటించారు.

కరోనా సోకి కోలుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని.. లాక్‌డౌన్ -1 ప్రారంభమైనప్పుడు రికవరీ రేటు 7.1 శాతం ఉండగా, లాక్‌డౌన్-2 సమయంలో 11.42 శాతం, తర్వాత అది 26.59 శాతానికి పెరిగి, ప్రస్తుతం 39.62 శాతానికి పెరిగిందని లవ్ అగర్వాల్ ప్రకటించారు.

Also Read:బ్రేకింగ్: ఈ నెల 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం

ప్రస్తుతం దేశంలో 61,149 యాక్టివ్ కేసులు ఉన్నాయని... 42,298 మంది కోవిడ్ 19 నుంచి కోలుకున్నారని ఆయన చెప్పారు. కాగా గత 24 గంటల్లో 1,07,609 కరోనా నిర్థారిత పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

ఇక రాష్ట్రాల వారీగా 31,136 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో, గుజరాత్ (12,140), తమిళనాడు (12,448), ఢిల్లీ (10,554) తర్వాతి స్థానంలో ఉన్నాయి. మనదేశంలో ఇప్పటి వరకు 1,06,750 మందికి కరోనా సోకింది.