దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్‌ ఆత్యాచార ఘటనలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు దిగింది. ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. వీరిలో హాథ్రస్‌ జిల్లా ఎస్పీ విక్రాంత్ వీర్‌, డీఎస్పీ రామ్‌ శబ్ద్‌, ఇన్‌స్పెక్టర్‌ దినేష్‌ వర్మ, సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ జగ్‌వీర్‌ సింగ్, హెడ్‌ కానిస్టేబుల్ మహేష్‌ పాల్ ఉన్నారు.

ప్రాథమిక నివేదికల ఆధారంగా వీరిపై చర్యలు తీసుకున్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి.  దళిత యువతి అత్యాచారం, దారుణహత్యపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

అంతేగాక, ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు ఇవ్వకుండా పోలీసులే దహనం చేయడంపైనా రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. యూపీలో ఆడపిల్లలకు రక్షణ లేదంటూ విపక్షాలు, ప్రజా, మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఆడపడుచుల భద్రత, వారి అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలోని ఆడపడుచులకు హాని కలిగించాలని భావించిన వారిని అత్యంత కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఆ శిక్ష భవిష్యత్ తరాలకు కూడా గుర్తుండిపోయేలా చేస్తామన్నారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులను సస్పెండ్ చేయాల్సిందిగా సిఫారసు చేసింది. నిందితులు, బాధితురాలి కుటుంబసభ్యులకు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా సిట్ బృందం కోర్టును కోరింది. 

హత్రాస్‌ ఘటనలో నిందితులను ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, వారి మద్దతుదారులు ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.

హత్రాస్‌ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వారికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీల నాయకులతో సహా వందలాది మంది ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అక్కడకు చేరుకుని వారికి మద్దతు తెలిపారు