మన దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఏర్పాటు కానుంది. ఎన్‌టీపీసీ రూపొందించిన ఈ ప్రాజెక్టును విశాఖపట్నం సమీపంలోని సింహాద్రిలో ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటని పేర్కొంది. భారత్‌లో భారీ హైడ్రోజన్ ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టులకు ఇది నాందీ పలకనుంది.

న్యూఢిల్లీ: పర్యావరణ మార్పుల (Climate Change) పై చర్యలు తీసుకోవడానికి ప్రపంచ దేశాలు అనేక సార్లు చర్చలు చేశాయి. ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. నిర్దేశించిన లక్ష్యాలు మాత్రం చాలా వరకు కార్యరూపం దాల్చడం లేదు. కానీ, భారత్ (India) ఇందుకు భిన్నంగా పర్యావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని హరిత ఇంధనం వైపు చూస్తున్నది. ఇందులో భాగంగానే దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ ప్రాజెక్టు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని సింహాద్రిలో ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది మన దేశ తొలి గ్రీన్ హైడ్రోజన్ (Green Hydrogen) బేస్డ్ ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టు (Project) గా నిలవనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా ఉండనుంది.

విశాఖపట్నం సమీపంలోని సింహాద్రిలో ఈ ఎన్‌టీపీసీ (NTPC) ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నట్టు ఆ ప్రకటన వెల్లడించింది. భారీ హైడ్రోజన్ ఎనర్జీ Storage ప్రాజెక్టులకు ఇది నాందీ పలకనుంది. అంతేకాదు, దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో మల్టీపుల్ మైక్రోగ్రిడ్ (Micro Grid) ప్రాజెక్టుల ఏర్పాటు, వాటిపై అధ్యయనం చేయడానికి ఈ ప్రాజెక్టు ఉపకరించనుంది. 

Also Read: వచ్చే పదేళ్లలో గ్రీన్ హైడ్రోజన్ ధరను భారీగా తగ్గించడానికి రిలయన్స్ కృషి చేస్తుంది: ముకేష్ అంబానీ

విశాఖపట్నం సమీపంలో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టులో 240 కిలోవాట్ల సాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రోలైజర్‌‌లతో సమీపంలోని సోలార్ ప్రాజెక్టుల సహాయంతో హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయనున్నారు. సూర్య రశ్మి సహకారంతో ఉత్పత్తి చేసిన హైడ్రోజన్‌ను అత్యధిక పీడనాల దగ్గర నిల్వ చేయనున్నారు. 50కిలోవాట్ల సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్‌తో దీన్ని విద్యుదీకరించనున్నారు. కాగా, సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అది స్వతంత్రంగా పని చేసుకుంటుంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాన్ఫిగరేషన్‌ను ఎన్‌టీపీసీ స్వయంగా డిజైన్ చేసింది. మన దేశానికి ఇదొక ప్రత్యేకమైన ప్రాజెక్టు. దీని ద్వారా ఎక్కడో దూర తీరాల్లో ఉండే.. ఉదాహరణకు లడాఖ్, జమ్ము కశ్మీర్ రీజియన్‌లలోనూ డీకార్పనైజింగ్‌కు ఇది దోహదపడనుంది. 2070 కల్లా భారత దేశం కార్బన్ తటస్థ స్థితిని అందుకోవడానికి, లడాక్ రీజియన్‌ను కూడా కార్బన్ న్యూట్రల్ టెర్రిటరీగా మార్చాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆాకాంక్షల మేరకు ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.

Also Read: మీ ప్రభుత్వాలను అడగండి: పెట్రోల్, డీజిల్ రేట్లపై నిర్మలా సీతారామన్

భారత్ దారిలోనే నడవాలి: ఫస్ట్ సోలార్ సీఈవో

ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఫస్ట్ సోలార్ సంస్థ సీఈవో మార్క్ విడ్మార్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఫస్ట్ సోలార్ సీఈవో మార్క్ పర్యావరణ మార్పుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. మిగతా దేశాలూ భారత్‌ దారిలో నడవాలని, ఈ దేశంతో పోటీ పడాలని అన్నారు. ఇదే సమావేశంలో భారత్ 450 గిగా వాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేసే లక్ష్యాన్ని మరోసారి ప్రధాని మోడీ గుర్తు చేశారు. అంతేకాదు, సోలార్ ఎనర్జీ కోసం మాన్యుఫాక్చరింగ్‌పై ఫోకస్ పెట్టినట్టు వివరించారు. తాము అమలు చేస్తున్న పీఎల్ఐ స్కీమ్ ద్వారా సోలార్ ఎనర్జీ రంగంలోని సంస్థలు ఎక్కువగా లబ్ది పొందవచ్చునని చెప్పారు.