Asianet News TeluguAsianet News Telugu

హర్యానా ఎల్లెనాబాద్ ఉపఎన్నికలో ‘రైతుల విజయం’.. ఆరువేల మెజార్టీతో అభయ్ గెలుపు

దేశమంతా హర్యానా ఎల్లెనాబాద్ ఉపఎన్నికపై ఆసక్తిగా చూసింది. రైతుల ఆందోళనల నేపథ్యంలో ఈ ఉపఎన్నికకు ప్రాధాన్యత సంతరించుకుంది. రైతుల డిమాండ్ మేరకు రాజీనామా చేసిన ఎమ్మెల్యే అభయ్ చౌతలానే మరోసారి ఇక్కడి నుంచి గెలుపొందారు. 6,708 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ఇది తన విజయం కాదని, ఇది రైతుల విజయమని అభయ్ చౌతలా ప్రకటించారు. 
 

farmers win in haryanas ellenabad bypoll says INLD leader abhay chautala
Author
Chandigarh, First Published Nov 2, 2021, 4:21 PM IST

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికలతో పోల్చితే Haryanaలోని Ellenabad ఉపఎన్నికకు ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ అసెంబ్లీ Bypollనే Farmers Demand కారణంగా వచ్చింది. ఈ ఎన్నికలోనూ వారే విజయం సాధించారు. హర్యానా ఎల్లెనాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో INLD అభ్యర్థి Abhay Chautala 6,708 ఓట్లతో గెలుపొందారు. అభయ్ చౌతలా 65,897 ఓట్లు గెలుచుకోగా, BJP అభ్యర్థి గోబింద్ కాండా 59,189 ఓట్లు, Congress అభ్యర్థి పవన్ బెనివాల్ 20,857 ఓట్లు పొందారు.

ఎల్లెనాబాద్‌లో మెజార్టీ ప్రజలు రైతులే. కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో ఈ నియోజకవర్గం నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో రైతులు పాల్గొన్నారు. తమ నిరసనలకు ఎల్లెనాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఐఎన్‌ఎల్‌డీ నేత అభయ్ చౌతలా సంఘీభావం చెప్పాలని డిమాండ్ పెరిగింది. తమ ఎమ్మెల్యేపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో అభయ్ చౌతలా రైతుల నిరసనలకు సంఘీబావంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపఎన్నిక గతనెల 30న జరిగింది.

Also Read: రైతుల బ్యాలెట్ పవర్‌కు పరీక్ష.. ఎల్లెనాబాద్ ఉపఎన్నిక

ఐఎన్‌ఎల్‌డీ గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకున్నది ఒకే ఒక సీటు. అదీ ఎల్లెనాబాద్ నుంచే. రైతుల డిమాండ్ల మేరకు దానికీ అభయ్ చౌతలా రాజీనామా చేశారు. మళ్లీ బరిలోకి దిగారు. కానీ, దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల నిరసనల నేపథ్యంలో ఈ ఎన్నికలను రైతుల రిఫరెండమ్‌గా చూశారు. పంజాబ్ తర్వాత అత్యధికంగా రైతు ఆందోళనల హీట్ హర్యానాలోనే కనిపించింది. అందుకే బీజేపీకి ఈ ఎన్నికలో గెలవడం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. రాష్ట్రంలో అధికారంలోని బీజేపీ, జేజేపీ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఎలాగైనా గెలిచే తీరాలన్నట్టుగా క్యాంపెయిన్ చేశాయి.

అయినప్పటికీ రైతుల డిమాండ్లకు తలొగ్గి రాజీనామా చేసిన ఐఎన్‌ఎల్‌డీ అభ్యర్థి అభయ్ చౌతలా మరోసారి ఇక్కడి నుంచి గెలుపొందారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నా గెలుపు తర్వాత సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ ఇకనైనా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నా గెలుపు కనీసం 30వేల మెజార్టీతో ఉండాల్సిందని, కానీ, బీజేపీ కోట్ల రూపాయలు వెదజల్లిందని, ఓటర్లను మభ్యపెట్టడానికి పంచి పెట్టిందని ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇందుకు వినియోగించిందని పేర్కొన్నారు. నా కళ్లతో స్వయంగా ఇది చూశానని చెప్పారు. ఈ విజయం తనది కాదని, ఈ విజయం రైతుల విజయమని అభయ్ చౌతలా వివరించారు. ఇది రైతులు, ఎల్లెనాబాద్ ప్రజల విజయమని పేర్కొన్నారు.

Also Read: Bypoll Results 2021 Live Updates: 3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

ప్రచారంలో రైతుల నుంచి బీజేపీ అభ్యర్థి గోబింద్ కాండా తీవ్ర నిరసనలు ఎదుర్కోవలసి వచ్చింది. ప్రచారంలో భాగంగా కాండా వెళ్లిన చోట రైతుల నుంచి నిరసన ఎదురైంది. ఇటీవలే ఓ స్థానిక గురుద్వారా నుంచి రైతులు ఆయనను వెళ్లగొట్టారు. గ్రామాల్లోనూ ఆయన వెళ్లినచోట బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఇటీవలే సంయుక్త కిసాన్ మోర్చా కలశ్ యాత్ర చేపట్టింది. లఖింపూర్ ఖేరి ఘటనలో మరణించిన రైతుల ఛితాభస్మంతో ఎల్లెనాబాద్‌లోని పలుగ్రామాల్లో కలశ్ యాత్ర చేసింది. మొత్తంగా ఇక్కడ రైతులు బీజేపీ వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios