ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేసుకున్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఆనాటి ఉద్యమకారులకు ఆసక్తికర సూచన చేశారు. అదేంటో తెలుసా?
Emergency : భారతదేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి నేటికి సరిగ్గా అర్ధ శతాబ్దం (50 ఏళ్లు) పూర్తవుతోంది. 1975 జూన్ 25న ఆనాటి రాష్ట్రపతి పక్రుద్దిన్ అలీ అహ్మద్ దేశంతో ఎమర్జెన్సీని విధించారు. దాదాపు 21 నెలలపాటు ఈ ఎమర్జెన్సీ కొనసాగింది... చివరకు 1977 మార్చి 21న ఈ అత్యవసర పరిస్థితి ముగిసింది.
1975 జూన్ లో 12న అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నికను రద్దు చేసింది. ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాగాన్ని ఉపయోగించి ఇందిరాగాంధీ గెలిచారన్న ప్రత్యర్థుల వాదనతో ఏకీభవించిన అలహాబాద్ కోర్టు ఆమె ఎన్నికను రద్దు చేసింది. దీంతో ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామ తర్వాత చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా ఇందిరాగాంధీకి దూరమవడం... ఆమెకు వ్యతిరేకంగా పావులు కదపడం చేశారు. అంతేకాదు జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం, ప్రతిపక్షాలు ఏకమవుతుండటంతో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు.
ఈ ఎమర్జెన్సీ కాలంలో రాజకీయ నాయకుల కాదు విద్యార్థి నాయకులు చివరకు పాత్రికేయులు కూడా జైలుజీవితం గడిపారు. ప్రజలు అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నారు. ఇలా ఎమర్జెన్సీ కాలంలో ఇబ్బందిపడిన నాయకుల్లో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు. ఈ ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను ప్రధాని గుర్తుచేసుకున్నారు.
ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేసుకున్న ప్రధాని మోదీ :
భారతదేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో తాను యువ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ ని అని ప్రధాని మోదీ తెలిపారు. ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించానని... ఇది తనకు ఎన్నో విషయాలు నేర్పించి అనుభవాన్ని ఇచ్చిందన్నారు మోదీ. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలో నేర్చుకున్నానని అన్నారు. అలాగే చాలామంది ద్వారా రాజకీయాల గురించి నేర్చుకున్నానని వెల్లడించారు.
తాజాగా ఎమర్జెన్సీ సమయంలోని తన అనుభవాలలో కొన్నింటిని సేకరించి బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ఒక పుస్తకంలో ప్రచురించిందని ప్రధాని మోదీ తెలిపారు. దీనికి ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటంచేసిన నాయకుడు, మాజీ ప్రధాని దేవెగౌడ ముందుమాట రాసారని అన్నారు. 'ఎమర్జెన్సీ డైరీస్' పేరుతో తీసుకువస్తున్న ఈ పుస్తకం ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు.
ఎమర్జెన్సీ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకొండి : ప్రధాని పిలుపు
అత్యవసర పరిస్థితిలో (ఎమర్జెన్సీ) చాలామంది నాయకులు అక్రమ నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు... ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి చీకటి రోజులు ఎలా గడిచాయో గుర్తుచేసుకుని సోషల్ మీడియాలో పంచుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఆకాలంలో పడిన ఇబ్బందులు, నిర్భందాల గురించి చెప్పివుంటే, ఇంకెలాగైనా మీకు తెలిస్తే వాటిని కూడా తెలియజేయాలని సూచించారు. ఎమర్జెన్సీ గురించి నేటి తరానికి తెలియాలని... అందుకే దీని గురించి సోషల్ మీడియాలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ.
1975 నుండి 1977 వరకు సాగిన అవమానకర ఘటనలపై నేటి యువతకు తెలియాలన్నారు. తద్వారా వారికి అవగాహన కలుగుతుందన్నారు. మరి ప్రధాని మోదీ పిలుపుకు ఎంతమంది స్పందించి ఎమర్జెన్సీ అనుభవాలను పంచుకుంటారో చూడాలి.
ఎమర్జెన్సీపై ఏపీ బిజెపి ప్రత్యేక కార్యక్రమం :
భారతదేశంలో అత్యవసర పరిస్థితి సమయంలో రోజులను గుర్తుచేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ బిజెపి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఎమర్జెన్సీపై అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. ఆనాటి చేదు ఘటనలను నేటి తరానికి తెలియచేయడానికే ఈ సదస్సులు నిర్వహిస్తున్నామని బిజెపి చెబుతోంది.
ఏలూరులో నిర్వహించనున్న అవగాహన సదస్సుకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సదస్సు కు రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, తిరుపతి సదస్సు కు బిజెపి జాతీయ అధికార ప్రతినిధి భువనేశ్వర్, ఎంపి అపరాజిత సారంగి ముఖ్య అతిథి గా హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ సదస్సులు నిర్వహిస్తామని ఏపీ బిజెపి ప్రకటించింది.
