త్యాగానికి ప్రతీకగా ముస్లింలు భావించే బక్రీద్ పండగ రోజు అక్రమంగా జంతువులను వధించకుండా చూసుకోవాలని బాంబే హైకోర్టు తెలిపింది. ఈ మేరకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు ఆదేశాలు జారీ చేసింది.
బక్రీద్ పండుగ సందర్భంగా దక్షిణ ముంబైలోని నివాస కాలనీలో జంతువులను అక్రమంగా వధించకుండా చూడాలని బాంబే హైకోర్టు బుధవారం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ను ఆదేశించింది. సాధారణ కోర్టు సమయం తర్వాత జరిగిన ప్రత్యేక అత్యవసర విచారణలో జస్టిస్ జీఎస్ కులకర్ణి, జస్టిస్ జితేంద్ర జైన్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. నగర పాలక సంస్థ లైసెన్స్ మంజూరు చేస్తేనే నథానీ హైట్స్ సొసైటీలో వధను అనుమతించవచ్చని పేర్కొంది.
యజమాని ఇంట్లోకి పోనివ్వకుండా చిరుతను భయపెట్టిన శునకం.. తోక ముడిచి పరుగులు పెట్టిన పులి..వీడియో వైరల్
ఒకవేళ ఆ స్థలంలో జంతువుల వధకు మున్సిపల్ కార్పొరేషన్ లైసెన్స్ ఇవ్వని పక్షంలో రేపు (గురువారం) ప్రతిపాదిత జంతువుల వధను నిరోధించడానికి పోలీసు సిబ్బంది సహాయంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు తెలిపింది.
దక్షిణ ముంబైలోని నివాస కాలనీల్లో జంతువుల వధను పూర్తిగా నిషేధించాలని కోరుతూ సొసైటీ నివాసి హరేష్ జైన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం విచారించింది. అయితే పూర్తి నిషేధం విధించలేమని బీఎంసీ తరఫు న్యాయవాది జోయెల్ కార్లోస్ తెలిపారు. సొసైటీ ఆవరణను నగరపాలక సంస్థ అధికారులు తనిఖీ చేస్తారని, ఉల్లంఘన జరిగితే తగిన చర్యలు తీసుకుంటామని కార్లోస్ తెలిపారు. ఒకవేళ చర్యలు తీసుకోవాల్సి వస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకు తగిన పోలీసు సహాయం అందించాలని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
