Asianet News TeluguAsianet News Telugu

26 ఏళ్ల తర్వాత పోటీ, రేణుకా చౌదరి ఓటమి: ఇప్పుడు ఏ పార్టీ బలం ఎంత?

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి 26 ఏళ్ల తర్వాత పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Deputy chair person election: After 26 years

న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి 26 ఏళ్ల తర్వాత పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజెపిని ఓడించాలనే లక్ష్యమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెసుతో పాటు బిజెపిని రాజకీయ శత్రువుగా పరిగణిస్తున్న మమతా బెనర్జీ వంటి ప్రాంతీయ పార్టీల నేతల కారణంగా పోటీ తప్పేట్లు లేదు. 

గతంలో జరిగిన ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి నజ్మా హెప్తుల్లా ప్రతిపక్ష అభ్యర్థి రేణుకా చౌదరిపై 33 ఓట్ల తేడాతో డిప్యూటీ చైర్మన్ పర్సన్ గా విజయం సాధించారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే, బిజెపికి గానీ కాంగ్రెసుకు గానీ డిప్యూటీ చైర్ పర్సన్ అభ్యర్థిని గెలిపించుకునే బలం లేదు. యుపిఎకు గానీ, ఎన్డీఎకు గానీ సంఖ్యాబలం లేకపోవడంతో ప్రాంతీయ పార్టీల మద్దతు మీద ఆధారపడాల్సి ఉంది. ఇందులో 17 ఓట్లు గల మూడు పార్టీలు బిజెడి, టీఆర్ఎస్, వైసిపి మద్దతు కీలకం కానుంది. తొమ్మిది ఓట్లు ఉన్న బిజెడి బిజెపి అభ్యర్థికి మద్దతు ఇస్తే మాత్రం ఎన్డీఎ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలున్నాయి. 

విజయానికి 123 ఓట్లు అవసరమవుతాయి. ప్రస్తుతం ఎన్డీఎకు 108 మంది సభ్యులు, యుపిఎతో బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలు కలిస్తే ప్రతిపక్షాల బలం 119కి పెరుగుతుంది. ఈ స్థితిలో బిజెపి నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్, సినీ తారలు మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్, మరాటీ రచయిత బాబా సాహెబ్ పురంధరేలతో నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలనే ఆలోచనలో ఉంది. ఆ నాలుగు ఖాళీలను భర్తీ చేసినా కూడా మెజారిటీ సరిపోదు. దాంతో 26 ఏళ్ల తర్వాత డిప్యూటీ చైర్మన్ పదవికి పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

బిజెడితో పాటు వైసిపి మద్దతు ఇస్తే ఎన్డీఎ అభ్యర్థి గట్టెక్కవచ్చు. కానీ అది అంత సులభంగా కనిపించడం లేదు. ఈ స్థితిలో బిజెపి హుందాగా పోటీ నుంచి తప్పుకుని ప్రతిపక్షాల అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తుందా అనేది కూడా చెప్పలేని స్థితి. ఈ స్థితిలో తమకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ప్రతిపక్షాలు ముందుకు తెస్తే బిజెపి అంగీకరించవచ్చునని అంటున్నారు. అప్పుడు కేసిఆర్ నిలబెట్టే కేశవరావుకు అవకాశం వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. 

ప్రతిపక్ష కూటమి సంఖ్యా బలం

కాంగ్రెసు 52
తృణమూల్ కాంగ్రెసు 13
ఆమ్ ఆద్మీ పార్టీ 3
బహుజన సమాజ్ పార్టీ 4
సిపిఐ 1
సిపిఎం 5
డిఎంకె 4
ఇండిపెండెంట్లు 3
ఐఎన్ఎల్డీ 1
ఐయూఎంఎల్ 1
పిడీపీ 2
జెడిఎస్ 1
కేరళ కాంగ్రెసు 1
ఎన్సీపీ 4
ఆర్జెడీ 5
సమాజ్ వాదీ పార్టీ 13
టీడీపి 6
మొత్తం 119

బిజెపికి మద్దతు ఇచ్చే పార్టీల సంఖ్యా బలం

బిజెపి 76
అన్నాడియంకె 13
బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 1
జెడియూ 6
నాగా పీపుల్స్ ఫ్రంట్ 1
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా 1
శిరోమణి అకాలీదళ్ 3
సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ 1
ఇండిపెండెంట్లు 3
మొత్తం 108

తటస్థంగా ఉన్న పార్టీలు

బిజెడి 9
టీఆర్ఎస్ 6
వైసిపి 2
మొత్తం 17

Follow Us:
Download App:
  • android
  • ios