'ఇద్దరు భార్యలు ఉన్నవారికి రూ. 2 లక్షలు ఇస్తాం' కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సెన్సేషనల్ కామెంట్స్
Congress Leader Kantilal Bhuria: 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సంచలన వ్యాఖ్యలపై బీజేపీ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఏమన్నారో తెలుసా?
Congress Leader Kantilal Bhuria: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ పూర్తి కాగా.. నాలుగో దశ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దం చేశారు. రేపటితో నాలుగో దశ ప్రచారం కూడా ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఎలాగైనా మెజార్టీ సీట్లు సాధించాలని ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. ఆయా పార్టీలు తన అభ్యర్థులు గెలుపించేందుకు జోరుగా ప్రజాక్షేతంలో తిరుగుతున్నారు. భారీ భారీ హామీలిస్తూ.. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు.. తాము గెలిస్తే ఎలాంటి పథకాలను తీసుకొస్తామనే విషయాలను చెబుతున్నారు. ఇలా గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు పార్టీ నేతలు.
ఇక్కడ వరకు అంత బాగానే ఉంది. కానీ.. కొందరూ నేతలు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో విచ్చలవిడి హామీలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నారో? ఎందుకు మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని రత్లాం లోక్ సభ నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి కాంతిలాల్ భూరియా .. ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన హామీ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ప్రత్యార్థులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ కాంగ్రెస్ అభ్యర్థి చేసిన వివాదాస్పద కామెంట్స్ ఏంటో తెలిస్తే.. మీరు కూడా ఆశ్చర్యపోతారు.
గురువారం సైలానాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంతిలాల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోలో మహాలక్ష్మి యోజనను ప్రస్తావించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఏటా రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆ డబ్బులు కూడా నేరుగా మహిళల అకౌంట్లలోనే జమ అవుతుందనీ కాంతిలాల్ చెప్పారు. ఇద్దరు భార్యలు ఉన్న వారికి రూ.2 లక్షలు అందజేస్తామనీ ఈ పథకం మరింత లాభం చేకూరుస్తుందని కాంతిలాల్ అన్నారు. ఇలా ఇద్దరు భార్యలు ఉంటే.. రూ.2లక్షలు ఇస్తామని వివాదాస్పద కామెంట్స్ చేశారు.
అదే ర్యాలీలో మాట్లాడిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ భూరియా ప్రకటనను సమర్థించారు. 'ఇద్దరు భార్యలు ఉన్న వ్యక్తికి రెట్టింపు మొత్తం (రూ. 1 లక్ష ఆర్థిక సహాయం) అందజేస్తామని భూరియా జీ ఇప్పుడే అద్భుతమైన ప్రకటన చేశారు' అని ఆయన అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం.. మహాలక్ష్మి యోజన కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బిపిఎల్) మహిళలకు నెలకు రూ.8500 అందిస్తామనీ, ఇలా సంవత్సరానికి రూ. 102000 అందిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఈ ప్రకటనపై అధికార భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. గత కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపిఎ) ప్రభుత్వంలో గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన కాంతిలాల్ భూరియా పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్ చేసింది.