న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల వెనక కుట్ర ఉందని, ఎన్నికల సమయంలో కూడా దేశం దాన్ని చూసిందని కాంగ్రెసు తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఢిల్లీ పరిస్థితికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని, ఆయన రాజీనామా చేయాలని ఆమె అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. 

పలువురు బిజెపి నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి భయాందోళనలను, విద్వేషాలను సృష్టించారని ఆమె విమర్శించారు. శాంతిసామరస్యాలను కాపాడడంలో పాలనా యంత్రాంగం ప్రజల వద్దకు చేరేలా చూడడంలో విఫలమయ్యారని, అందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు, ఢిల్లీ ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత ఉంటుందని ఆమె అన్నారు. 

Also Read: ఢిల్లీ అల్లర్లు: 20 మంది మృతి, సైన్యాన్ని దింపాలని కేజ్రీవాల్

గత 72 గంటలుగా పోలీసులు చేతులు ముడుచుకుని కూర్చుకున్నారని, ఇప్పటి వరకు 18 మంది ప్రాణాలు గాలిలో కలిశాయని, వందల మంది ఆస్పత్రుల్లో చేరారని, చాలా మందికి గన్ షాట్స్ దెబ్బలు ఉన్నాయని, ఈశాన్య ఢిల్లీలో తెంపు లేకుండా హింస చెలరేగుతోందని ఆమె అన్నారు. 

ఇదిలావుంటే, హింసకు పాల్పడవద్దని, జాగ్రత్తగా ఉండి శాంతిని పరిరక్షించాలని కాంగ్రెసు నేత ప్రియాంక గాంధీ వాద్రా కోరారు. హింస వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తాను ఉత్తరప్రదేశ్ పార్టీ కార్యకర్తలకు సూచించినట్లు ఆమె తెలిపారు. 

Also Read: ఢిల్లీ అల్లర్లపై విచారణ: హైకోర్టులో బిజెపి నేత కపిల్ మిశ్రా వీడియో ప్లే

తాము మార్చ్ చేసి రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రం ఇద్దామని అనుకున్నామని, అయితే, తాను అందుబాటులో ఉండడం లేదని రాష్ట్రపతి నుంచి సమాచారం వచ్చిందని, దీంతో కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేసుకన్నామని కాంగ్రెసు నేత రణదీప్ సుర్జేవాలా చెప్పారు.