న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో అల్లర్లను అదుపు చేసే విషయంలో ఢిల్లీ పోలీసుల వ్యవహార శైలిపై హైకోర్టు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల తీరుపై ఆశ్చర్యం వేస్తోందని జస్టిస్ మురళీధర్ అన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన బిజెపి నేతలపై కేసులు నమోదు చేయాలని హైకోర్టు పోలీసు కమిషనర్ కు చెప్పాలని సోలిసిటర్ జనరల్ ను ఆదేశించింది.

అందరు న్యాయవాదులు, డీసీపీ దేవ్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమక్షంలో బిజెపి నేత కపిల్ మిశ్రా వీడియో క్లిప్ ను కోర్టులో ప్రదర్శించారు. కపిల్ మిశ్రా విద్వేషపూరిత ప్రసంగం చేసినప్పుడు డీసీపీ పక్కనే ఉన్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. నాయకులు విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు తాను చూడలేదని సొలిసిటర్ జనరల్ అనడంతో కపిల్ మిశ్రా వీడియో క్లిప్ ను హైకోర్టులో ప్రదర్శించడానికి న్యాయమూర్తులు పూనుకున్నారు.

పరిస్థితి విచారకరంగా ఉందని, కొంత మంది నాయకులు బహిరంగంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వీడియోలను తాము చూశామని, ప్రతి న్యూస్ చానెల్ లో అది ప్రసారమైందని జస్టిస్ మురళీధర్ అన్నారు. ఢిల్లీలో పూర్తిగా పోలీసుల నిర్లక్ష్యం వల్లనే హింస పెచ్చరిల్లిందని  పి. చిదంబరం చెప్పారు. 

ఢిల్లీ హైకోర్టులో విచారణ రాత్రి 12.30 గంటలకు ప్రారంభమైంది. జస్టిస్ ఎస్ మురళీధర్ నివాసంలో ఆ విచారణ జరిగింది. గాయపడినవారిని ఆస్పత్రులకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా చేర్చేందుకు, వారికి సరైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవానలి జస్టిస్ మురళీధర్, జస్టిస్ అనూప్ జె భాంభానిలతో కూడిన హైకోర్టు బెంచ్ పోలీసులను ఆదేశించింది. 

గాయపడినవారి సమాచారాన్ని, వారికి అందించిన చికిత్స వంటి వివరాలు స్టేటస్ రిపోర్టు సమర్పించాలని కూడా కోర్టు ఆదేశించింది. విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.