న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు సద్దుమణగడం లేదు. ఆదివారం ప్రారంభమైన అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 20 మంది మృత్యువాత పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మరణించారు. 

సిఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ప్రారంభమైన ఘర్షణ హింసకు, దాడులకు దారి తీసింది. ఘర్షణల్లో 150 మంది దాకా గాయపడ్డారు. హింస చెలరేగిన ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పోలీసులు, పారా మిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడం లేదు. 

పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోతున్నారని అంటూ సైన్యాన్ని రంగంలోకి దింపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరుతున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మంగళవారం రాత్రి హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు. పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. 

సీలంపూర్, జాఫ్రాబాద్, మౌపర్, గోలక్ పురి చౌక్ వంటి ప్రాంతాల్లో అజిత్ దోవల్ పర్యటించారు. భద్రతకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ సమావేశం కానుంది. కమిటీకి అజిత్ దోవల్ పరిస్థితులను వివరిస్తారు. బయటి వాళ్లకు అది వార్ జోన్ లాగా కనిపిస్తోంది. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను వాయిదా వేశారు. 

Also Read: పరిష్కరించుకుందాం, ప్రపంచం చూస్తోంది: ఢిల్లీ అల్లర్లపై కేటీఆర్ ట్వీట్

రాత్రంతా పోలీసులతో తాను మాట్లాడుతూనే ఉన్నానని, పరిస్తితి ప్రమాదకరంగా ఉందని, పోలీసులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ పరిస్థితిని అదుపు చేయలేకపోతున్నారని, ఆర్మీని పిలిచి అల్లర్లు చెలరేగుతున్న ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తున్నట్లు తెలిపారు.