దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసులు 5,364కు చేరగా, మరణాల సంఖ్య 55కి పెరిగింది.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొవిడ్ (Covid) బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జూన్ 6న ఉదయం 8 గంటల వరకు దేశంలో మొత్తం 5,364 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
55 మంది కొవిడ్ కారణంగా…
గత 24 గంటల్లో కొత్తగా 498 మంది వైరస్ బారిన పడ్డారు. అలాగే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు కేరళ(Kerala) కు చెందినవారు కాగా, మిగిలిన ఇద్దరిలో ఒక్కరు పంజాబ్‌కు, మరొకరు కర్ణాటకకు చెందినవారని అధికారులు తెలిపారు.కేరళలో ప్రస్తుతం అత్యధికంగా 1,679 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీని తర్వాతి స్థానాల్లో గుజరాత్, పశ్చిమ బెంగాల్, దిల్లీలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 55 మంది కొవిడ్ కారణంగా మరణించారు.
ప్రస్తుతం పరిస్థితిని క్రమంగా సమీక్షిస్తూ, రాష్ట్రాలు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాస్క్‌లు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలనే సూచనలొస్తున్నాయి.
కరోనా కేసుల పెరుగుదలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ రోజువారీ సమాచారం విడుదల చేస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.


